తెలంగాణలో ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో చేపడుతున్న సాయం కూడా.. వారికి చేరువ కావడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు.. నిరంతరం ప్రజలకు టచ్లో ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. అధికారులను పరుగులు పెట్టించే పని చేస్తున్నారు. అయినా.. బాధితులకు స్వాంతన దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురించిన చర్చ ప్రారంభమైంది.
ఆయన ఎక్కడ ఉన్నారని.. ఏం చేస్తున్నారని.. ప్రజలు ఇంత విలయంలో ఉంటే.. పట్టించుకునే తీరిక లేదా? అంటూ.. రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇదే సమయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ సహా.. చుట్టుపక్కల జిల్లాల్లో సంచలన పోస్టర్లు దర్శన మిచ్చాయి. “తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడుట లేదు“ అని రాసి ఉన్న పోస్టర్లు.. ఆయన ఫొటోతోనే వెలిశాయి.
‘కేసీఆర్ మిస్సింగ్’ అంటూ పోస్టర్లపై రాశారు. వీటిని ఎవరు అంటించారనే విషయం తెలియక పోయినా.. దీనిపై ఉన్న వ్యాఖ్యలు.. మాత్రం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. “రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందు లు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్” అంటూ పోస్టర్లపై వ్యాఖ్యలు కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం.. అటు రాజకీ య వర్గాల్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. గతంలో.. బీఆర్ ఎస్ నాయకులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ తీసుకురాలేదని విమర్శిస్తూ.. “కేంద్రం ఏం ఇచ్చింది.. గాడిద గుడ్డు“ అని రాసి ఉన్న పోస్టర్లు అతికించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రివర్స్ అయి.. కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోస్టర్లు వెలిశాయి.