బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్ద ప్లాన్ తోనే హైదరాబాద్ కు వచ్చినట్లున్నారు. పైకి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అరెస్టుకు నిరసన తెలపటానికే అని చెబుతున్నారు. అయితే మీడియా సమావేశంలో నడ్డా మాట్లాడిన తీరు చూసిన తర్వాత హిడిన్ అజెండా ఏదో ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మీడియాతో మాట్లాడుతూ కేసీయార్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని చెప్పటంలో అర్థమేంటి ? హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారట.
ఒక సీఎంను పట్టుకుని మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని చెప్పటం అది కూడా హైదరాబాద్ కు వచ్చి చెప్పటమంటే మామూలు విషయంకాదు. హుజూరాబాద్ లో ఓడిపోయిన మాట నిజమే కానీ అంతమాత్రాన పిచ్చోడైపోయేంత దుర్బలుడు కాదు కేసీయార్. ఒక వేళ ఇదే నిజమైతే అంతకుముందు దుబ్బాకలో కూడా ఓడిపోయిన విషయాన్ని నడ్డా మరచిపోయారేమో. ఓవర్ కాన్ఫిడెన్స్ తో దుబ్బాకలో ఓడిపోతే సింపతీ ఫ్యాక్టర్ హుజూరాబాద్ లో ఈటలను గెలిపించిన విషయం అందరికీ తెలిసిందే.
దుబ్బాకలో అయినా హుజూరాబాద్ లో అయినా బీజేపీ గెలిచిందంటే అందుకు బయట ఫ్యాక్టర్లు కూడా యాడ్ అయ్యాయని మరచిపోకూడదు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొట్టేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కేసీయార్ ను ఓడిస్తామని చెప్పలేదు పడగొడతామనే నడ్డా చెప్పారు. కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొట్టడమంటే ఏమిటర్ధం ? ముందేమో కేసీయార్ పిచ్చోడన్నారు. తర్వాత కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. మొత్తంమీద కేసీయార్ ప్రభుత్వాన్ని బీజేపీ నిద్రపోనిచ్చేట్లు లేదు.
షెడ్యూల్ ఎన్నికలకు ఇంక ఉన్నది రెండేళ్ళు. ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం బాగా జరుగుతోంది. నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళితే బహుశా ఈ ఏడాది చివరిలోగా వెళ్ళచ్చేమో. కాబట్టే బీజేపీ నేతలు మంచి దూకుడు మీదున్నారు. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరోజు దీక్షంటారు. మరోరోజు ప్రగితిభవన్ ముట్టడంటారు. ఇంకో రోజు ధర్నాలంటారు. తర్వాత నిరాహారదీక్షంటారు. మొత్తానికి కేసీయార్ ప్రభుత్వాని గుక్కతిప్పుకోనీకుండా చేస్తున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో.