స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై రాజకీయ పార్టీలు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఒకేసారి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్, మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తమ వాదన వినిపిస్తోంది. అది ఏమిటంటే.. బాబు అరెస్టు వెనుక మోదీ, కేసీఆర్, జగన్ ఉన్నారని చెప్పడం. తాజాగా కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రంలో మోదీతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్.. కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శత్రువులుగా ఉన్నారు. దీంతో బాబు అరెస్టును అడ్డుపెట్టుకుని ఈ ముగ్గురిని ఒకేసారి టార్గెట్ చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బాబు అరెస్గు వెనుక మోదీ, కేసీఆర్, జగన్ ఉన్నారని తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. చంద్రబాబు గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారనే కారణంతో ఆయనపై కుట్ర పన్నారని మధుయాష్కీ అన్నారు.
బాబు ఇండియా కూటమిలో చేరితే ఎన్డీఏకు ముప్పు వాటిల్లుతుందని మోదీ భయపడుతున్నారని కూడా మధుయాష్కీ పేర్కొన్నారు. అందుకే మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్ర పన్ని బాబును అరెస్టు చేయించారని తెలిపారు. అంతే కాకుండా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని కూడా మధుయాష్కీ ఆరోపించారు. మరోవైపు బాబు అరెస్టు వెనుక కేసీఆర్ ఉన్నారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే బాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించడం లేదని చెబుతోంది. బాబుపై జరిగిన రాజకీయ కుట్రలో మోదీ, జగన్తో పాటు కేసీఆర్ కూడా ఉన్నారనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయని కూడా కాంగ్రెస్ చెబుతోంది. మరి ఈ ఆరోపణలను కేసీఆర్ అండ్ కో ఎలా తిప్పికొడుతుందో చూడాలి.