ఇంకెక్కడా దొరకనట్లు.. కొందరు ప్రజాప్రతినిధులు చేసే పనులు చూస్తే ఒళ్లు మండిపోతుంది. ఎవరికి వారికి వారిదంటూ ఒక ప్రైవేటు లైఫు ఉంటుంది. అలాంటి వేళలో.. ఎవరి ఇష్టానికి తగ్గట్లు వ్యవహరించటం తప్పేం కాదు. అశ్లీల వీడియోలు చూడమన్నది మా ఉద్దేశం కాదు. కాకుంటే.. అలాంటి వాంఛలు ఉంటే.. వాటిని తీర్చుకోవటానికి వేరే సమయం ఉంటుంది. బాధ్యత కలిగిన స్థానాల్లో ఉండి.. గౌరవనీయమైన పదవుల్లో ఉండే వారు ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ.. అలాంటిదేమీ పట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే కొందరు ప్రజాప్రతినిధుల తీరు తరచూ వివాదంగా మారుతుంటుంది. తాజాగా అలాంటి చెత్త పనే చేసి అడ్డంగా బుక్ అయ్యారు కర్ణాటకకు చెందిన ఒక ప్రజాప్రతినిధి. అదేం సిత్రమో కానీ దేశంలో పలు రాష్ట్రాలు ఉన్నా.. అశ్లీల వీడియోలు చూస్తూ అసెంబ్లీలో దొరికిపోయే ప్రజాప్రతినిధుల జాబితాలో కర్ణాటక పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మండలిలో చర్చ జరుగుతున్న వేళ.. ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ సెల్ ఫోన్లో అశ్లీల వెబ్ సైట్ లో వీడియోలు చూస్తూ ఉండిపోవటం కెమేరా కంటికి చిక్కింది.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ గా మారాయి. ఇది కాస్తా సంచలనంగా మారటమే కాదు.. ఎమ్మెల్సీగారిని తిట్టిపోస్తున్నారు. దీంతో.. ఈ వ్యవహారంపై స్పందించక తప్పని పరిస్థితి. తాను మంత్రితో మాట్లాడాల్సింది ఉందని.. దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్ ఫోన్ లో వెతుకుతున్నట్లుగా వివరణ ఇచ్చారు. మంత్రితో మాట్లాడేది దేని కోసం అంటూ పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాథోడ్ చేసిన పనిని బీజేపీ తప్పు పట్టింది.. అతడ్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. తొలుత మంత్రిని ప్రశ్నలు అడగటానికి నెట్ చూస్తున్నట్లు చెప్పిన రాథోడ్.. మరోసారితన ఫోన్ లో డేటా నిండిపోవటంతో కొన్నింటిని డిలీట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలా అదే పనిగా స్పందిస్తూ.. అడ్డంగా బుక్ అవుతున్న ఎమ్మెల్సీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికారు. అందులో ఒకరు ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండటం విశేషం. బుక్ అయినప్పుడు ఏదో చెప్పి తప్పించుకోవటం.. తర్వాతి కాలంలో వారే కీలక పదవుల్లో ఉండటం చూస్తే.. వ్యక్తిత్వానికి.. రాజకీయాలకు ఏమాత్రం లింకు ఉండనట్లుంగా ఉంది కదూ?