నాలుగు దశల పంచాయతీ ఎన్నికలకు పోరు ముగిసింది. ఈ నేపథ్యంలో కీలకమైన కాపు సామాజిక వర్గం ఎటు ఉందనే విషయం చూచాయగానే కాదు.. ఒకింత స్పష్టంగానే తెలిసింది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతిచ్చిన కాపు సామాజిక వర్గం.. ఆ ఎన్నికల్లో ఫుల్లుగా వైసీపీవైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక పోరులో.. కాపులు ఎటున్నారనే విషయం స్పష్టంగా తెలిసింది.
చాలా పంచాయతీలలో కాపులు జనసేన వైపు నిలిచారు. ఈ పరిణామమే.. జగన్ కేబినెట్లోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రుల్లో గుబులు రేపుతోంది. మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నుంచి విజయం సాధించిన.. కురసాల కన్నబాబు పరిస్థితి ఏంటి? ఆయన నియోజకవర్గంలో సగానికి పైగా ప్రాంతం.. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉంది. దీంతో ఇక్కడ ఎన్నికలు జరిగితే.. కాపులు ఆయనకు జై కొడతారా? ఆయన ప్రచారానికి పడిపోతారా? అనేది సందేహంగా మారింది. దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు తమకు ఏమీ చేయలేదని.. స్థానికంగా కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మాకు చేయలేక పోతే.. చేయలేక పోయారు.. కనీసం తనను తాను రక్షించుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కన్నబాబును క్షేత్రస్థాయిలో రెడ్డి సామాజిక వర్గం తొక్కేస్తోందనే వాదన అందరికీ తెలిసిందే. వారిని ఎదిరించలేక.. కన్నబాబు పూర్తిగా సైలెంట్ అయ్యారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి దూకుడు భరించలేక కన్నబాబు తల పట్టుకుంటున్నారు.
అంతేకాదు.. కేబినెట్లోనూ రెడ్డి మంత్రుల హవా ముందు కన్నబాబు వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో ఇక, తమకు ఏం చేస్తారని కాపులు భావిస్తున్నారు. దీనిని బట్టి.. కాకినాడ కార్పొరేషన్లో కాపులు.. ఈయనను చూసి వైసీపీ వైపు మొగ్గుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.