బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని సోమునుద్దేశించి కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. మిత్రపక్షం జనసేనను సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా దుయ్యబట్టారు. తన మనసులో మాటను పవన్ బయటపెట్టారని చెప్పారు.
రాష్ట్ర వ్యవహారాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని కన్నా అన్నారు. ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, కోర్ కమిటీ సమావేశాల ఊసే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌కు, కన్నాకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కాపుల రిజర్వేషన్ల అంశాన్ని, జిల్లాకు రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌ను జీవీఎల్ వినిపిస్తున్నారు.
కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారో జీవీఎల్ చెప్పాలని కన్నా విమర్శించారు. దీంతో, కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, అందుకే, ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే, కొంతకాలంగా పార్టీకి కన్నా అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీకి కన్నా రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కన్నాతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. అయితే, కన్నా జనసేనలో లేదా టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.