మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి అందరికీ తెలిసిందే. కౌరవులతో జూదమాడిన పాండవాగ్రజుడు ధర్మరాజు.. అన్నీ కోల్పో యి.. చివరకు పాండవుల ధర్మపత్ని ద్రౌపదిని పందేనికి ఒడ్డిన ఘటన తెలిసిందే. నిండు సభలో ఆమెనుకూడా ఓడిపోయి.. తర్వాత అడవుల బాట పట్టడం తెలిసిందే. అయితే.. ఇదే ఘటన తాజాగా జరిగింది. అయితే, ఇక్కడ కొంత డిఫరెంట్ ఉంది. అంతే తేడా! తాజా ఘటనలో మహిళ తనను తానే పందేని ఒడ్డుకుని.. ఒక వ్యక్తికి సొంత మైంది. ఈ ఘటన ఇప్పుడు దేశంలోనే చర్చనీయాంశంగా మారింది.
విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళకు లూడో గేమ్ ఆడే వ్యసనం ఉంది. అది కూడా తాము అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితోనే కొన్నాళ్లు లూడో గేమ్ ఆడుతోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని సార్లు గెలుస్తోంది. కొన్ని సార్టు ఓడుతోంది. తాజాగా మాత్రం ఆమె రెచ్చిపోయి లూడో ఆడింది. దీనిలో చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. అయినా.. ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో యజమాని మరింత రెచ్చగొట్టాడు. ఆడు ఆడు.. అంటూ వ్యంగ్యాస్త్రాలు రువ్వాడు.
దీంతో రెచ్చిపోయిన ఆమె పందెంగా పెట్టేందుకు ఏమీ లేక.. గెలుపు తనదేననే పెద్దనమ్మకంతో తనను తానే పందెంగా పెట్టుకుంది. “నేను ఓడితే.. ఇక నుంచి నీతోనే సంసారం“ అని చెప్పేసింది. అయితే, యజమాని మాత్రం తక్కువవాడా..? మరి నీ భర్త పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించాడు. “నీ ఇష్టం ఏమైనా చేసుకో` అని చెప్పింది. లూడో రంజుగా సాగింది. చివరకు యజమాని చేతిలో ఓడిపోయింది. ఇంకేమంది.. ఆమెను ఇంటి యజమాని వశం చేసుకున్నాడు.
కట్ చేస్తే.. సదరు మహిళ భర్త రాజస్థాన్‌లోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ.. ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. అయితే ఒకరోజు భార్యకు ఫోన్ చేసి తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. దీంతో అసలు విషయం భర్తకు చెప్పింది. తాను ఆటలో ఓడిపోయి ఇంటి యజమానికి సొంతం అయ్యానని.. మీరు ఇంటికి వస్తే గొడ్డలితో నరికేస్తాడని చెప్పింది. ఇంటికి రాకుండా పోలీసులు వద్దకు వెళ్లాలని కోరింది. దీంతో షాక్‌కు గురైన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు జూదం, ఆన్లైన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించాడు. ఇంటి యజమానికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.