తెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీరమణ ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన తీసు కున్న నిర్ణయం.. చేసిన సిఫారసులు.. దేశ న్యాయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టాన్ని ఏర్పరిచాయి. ఆయన చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టాక.. అప్పటి వరకు న్యాయస్థానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై ప్రధా నంగా దృష్టి పట్టారు. తద్వారా ఏళ్ల తరబడి.. పెండింగులో ఉన్న కేసులకు మోక్షం కలుగుతుందని ఆయన భావించారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులను కేటాయించారు. ఇప్పుడు సుప్రీం కోర్టులోనూ ఆయన న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేశారు.
సరికొత్త అధ్యాయం..
సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి 9 మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీం అదనపు భవనం ఆడిటోరియంలో మంగళవా రం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. సీజేఐ సహా 9 మంది కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సుప్రీం జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయంగా అయితే సీజేఐ కోర్టు రూమ్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా దృష్య్టా ఈసారి ఆడిటోరియంలో నిర్వహించారు.
సంచలన నిర్ణయం..
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ముగ్గురు హైకోర్టు మహిళా న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించారు. ఇందులో ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.వి.నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి దేశంలో ఆ స్థానానికి ఎదిగిన తొలి మహిళగా చరిత్ర సృష్టించ నున్నారు. ఆమె కాకుండా ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్, సుప్రీం కోర్టులో ఇప్పటివరకు సీనియర్ న్యాయవాదిగా ఉన్న తెలుగు వ్యక్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ కూడా భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలుగు వాడికి మరో ఛాన్స్
ప్రస్తుతం సీనియారిటీ పరంగా 19వ స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 9వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆ తర్వాత ప్రస్తుతం పదోన్నతి వరుసలో ఉన్న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ఆ ఏడాది సెప్టెంబర్ 23 వరకు సీజేఐగా బాధ్యతలు చేపడతారు. అనంతరం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు జస్టిస్ నాగరత్న ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. వీరి తర్వాతి వరుసలో పి.ఎస్. నరసింహ ఆ స్థానంలోకి వస్తారు.