సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బంపర్ మెజారిటీతో గెలుపొందాక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీలో ముఖ్య నాయకులంతా అధికారం లేని చోట ఇమడలేక అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్ త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసిన జగన్ కు బిగ్ షాక్ ఇవ్వనున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆదివారం నాడు కృష్ణా జిల్లాలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ముఖ్య నేత అయిన జోగి రమేష్ డుమ్మా కొట్టడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జోడి రమేష్ తో పాటు బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా పార్టీ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. దీంతో వీరిద్దరూ వైసీపీని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, కొద్ది రోజుల క్రితం అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నోటీసులు అందుకున్నాడు. ఓ క్షణంలోనైనా ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ మారాలని జోడి రమేష్ భావిస్తున్నారట. టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.