మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బుదవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు రిజెక్ట్ చేయడంతో.. హైదరాబాద్ మియాపూర్లో ఉన్న నందిగం సురేష్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన్ను మంగళగిరి తరలిస్తున్నారు. అయితే సురేష్ అరెస్ట్ తో మిగతా నేతలు అప్రమత్తం అయ్యారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలకంగా ఉన్న దేవినేని అవినాష్ పరారీ అయ్యారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మరీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు ఘటనల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఇప్పటికే జోగి రమేశ్, దేవినేని అవినాష్ తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో వారి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. దీంతో నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగర వైసీపీ నేత శ్రీనివాస రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన 12 పోలీసు బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి.