ఈ రోజు తెలంగాణలోని నిరుద్యోగులందరూ ఉదయం 10గంటలకు టీవీ పెట్టుకొని చూడండి…మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతానంటూ సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ వి కల్లబొల్లి కబుర్లని, ఏవో అరకొర ఉద్యోగాలిచ్చి ఊదరగొడతారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా…పరీక్షలు జరిగి, నియామకాలు జరిగేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుందని ఎద్దేవా చేశారు. ఇదంతా కేసీఆర్ ఎన్నికల స్టంట్ అని…నిరుద్యోగులు మోసపోవద్దని హెచ్చరించారు.
అయితే, విపక్షాల అంచనాలకు ఏమాత్రం అందకుండా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ చరిత్రలో ఉద్యోగాలకు సంబంధించిన భారీ ప్రకటన చేశారు. మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు అంతేకాదు, నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని, తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ అన్నారు. తక్షణమే 80,039 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలిస్తామని, అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్, 5 శాతం ఓపెన్ కోటా ఉంటుందన్నారు. ఓసీ అభ్యర్థులకు ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి 44గా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49గా, దివ్యాంగులు 54 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ తాజా ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.