మద్యం షాపులు వేలానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు అన్నిఇన్ని కావు. ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి లాటరీ విధానాన్ని అనుసరించటం తెలిసిందే. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు తమ వర్గానికి సంబంధించి మద్యం షాపుల కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కొందరు విజయవంతం అయితే.. మరికొందరు మాత్రం ఫెయిల్ అయ్యారు.
మంత్రి నారయణకు సంబంధించిన వారు మద్యం షాపుల కోసం ఏకంగా వంద అప్లికేషన్లు వేశారు. ఎన్నికల్లో తన విజయం కోసం పని చేసిన ముఖ్యనేతలు.. కార్యకర్తల కోసం తన సొంత డబ్బుల్ని అప్లికేషన్ల కోసం ఖర్చు చేశారు. ఒక్కో అప్లికేషన్ ఖరీదు రూ.2 లక్షలు కావటంతో.. రెండు కోట్ల రూపాయిల్ని కేవలం దరఖాస్తుల రూపంలో ఖర్చు చేశారు. వీలైనన్ని ఎక్కువ షాపులు తమ వాళ్లకు వస్తాయన్న ఉద్దేశంతో అంత భారీగా ఖర్చు చేస్తే.. నారాయణ టీంకు దక్కిన షాపులు కేవలం మూడు కావటం విశేషం.
తమ నాయకుడు తమ కోసం అంత ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవటంతో నారాయణ వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అంచనా కంటే చాలా తక్కువ షాపులు రావటంతో.. లాటరీలో తమకుదక్కిన మూడు షాపుల్లో ఒక్కో షాపును ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది మొయింటైన్ చేసుకునేలా ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఇదే మద్యం లాటరీల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు హాట్ టాపిక్ గా మారారు.
దీనికి కారణం.. తాడిపత్రి నియోజకవర్గంలో అత్యధిక దుకాణాలకు మూడేసి మాత్రమే అప్లికేషన్లు వచ్చాయి. వాటిల్లో ఎక్కవ శాతం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులకే దక్కాయి. దీంతో.. జేసీ బ్యాచ్ కు మహా సుడి అన్న ప్రచారం జరిగింది. అయితే.. తక్కువ మంది అప్లికేషన్లు పెట్టటం.. పెట్టినోళ్లలో అత్యధికులు జేసీ వర్గీయులు కావటంతో.. వారికే షాపులు దక్కాయని.. సుడి కంటే కూడా ‘సిస్టమాటిక్’ గా వ్యవహరించటమే ఎక్కువ షాపులు సొంతమయ్యేలా చేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.