రేషన్ బియ్యం మిస్సింగ్ స్కామ్లో అడ్డంగా ఇరుక్కున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని శనివారం మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమ గోడౌన్లో బియ్యం బస్తాలు తగ్గాయని చెబితే నగదు చెల్లించామని, డబ్బులు కట్టాక కూడా కక్ష కట్టి తమపై క్రిమినల్ కేసులు పెట్టారంటూ పేర్ని నాని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తన భార్యపై కొందరు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాజకీయ కక్ష సాధించడానికి ఇంట్లోని మహిళల వరకు రావటం బాధకరమని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
అయితే పేర్ని నాని వ్యాఖ్యలపై తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తు రాలేదా? పదే పదే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడినప్పుడు, చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు, అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు ఈ సభ్యత ఏమైంది? సిగ్గు లేకుండా ఇవాళ మహిళల గురించి మాట్లాడుతావా? అని జేసీ ప్రశ్నించారు. భార్యాపిల్లలు పేర్ని నానికేనా… మాకు లేరా? అని ధ్వజమెత్తారు.
నారా చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను ఎన్నెన్ని మాటలు అన్నారు. వాళ్లు మంచోళ్లు కాబట్టి ఊరికే ఉన్నారు.. మా చేతులు కట్టేసారు.. లేదంటే మా కార్యకర్తలు నీ తాట తీసేవారంటూ పేర్ని నానికి జేసీ చురకలు అంటించారు. నీ కుటుంభం గురించి చెప్తే ఉరి వేసుకుంటావ్.. విక్టోరియా గురించి చెప్పాలా..? అని జేసీ హెచ్చరించారు. అధికారం ఉందన్న ధీమాతో అన్యాయంగా తమపై కేసులు పెట్టిరని.. పేర్ని నానిని వదిలేది లేదని జేపీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెంద్ల మనోహర్ సైతం పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించారు. తప్పు చేయనప్పుడు జరిమానా ఎందుకు చెల్లించారు? అని ప్రశ్నించారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.