కొన్ని కొన్ని ఘటనలు యాదృచ్ఛికమే అయినా.. చిత్రంగా ఉంటాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జరిగిన ఘటన గుర్తుంది కదా! ఆయనను గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోర్టుల చుట్టు తిరిగినా.. పోస్టింగు ఇవ్వాలని అన్నా.. కూడా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరాఖరుకు.. ఇక, ఒక్క రోజులోఆయన రిటైర్మెంట్ అవుతున్నారనగా.. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డి చాలా పొద్దు పోయిన తర్వాత.. సదరుఫైలుపై సంతకం చేశారు. దీంతో తన సర్వీసులో చిట్ట చివరి రోజు.. ఉదయం అలా పోస్టింగ్ పొంది… సాయంత్రం ఇలా.. రిటైరయ్యారు.
ఇప్పుడు అదే జవహర్‌రెడ్డి విషయంలోనూ అచ్చం అలానే జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వా త.. అప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించి ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండానే.. పక్కన ఉంచింది. అయితే.. ఆయన ఈ నెల 30(ఆదివారం)న రిటైర్ కానున్నారు. దీంతో ఈయనకు కూడా.. అప్పట్లో ఏబీవీ మాదిరి పరిస్థితే ఎదురైంది. మరో రెండు రోజుల్లో రిటైర్ అవుతున్నక్రమంలో తాజాగా చంద్రబాబు ప్రభుత్వం జవహర్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది.
జవహర్ రెడ్డికి ఈడబ్ల్యూఎస్ సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే.. జూన్ 30 ఆదివారం కావడంతో ఒక రోజు ముందు అంటే జూన్ 29 శనివారం నాడే ఆఖరి వర్కింగ్‌డేగా గుర్తిస్తారు. కాబట్టి జవహర్‌రెడ్డి రిటైర్మెంట్కు ఒకరోజు ముందే పోస్టింగ్ వచ్చినట్టు అయింది. మరి ఆయన విధుల్లో చేరతారా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనా.. ఈ పరిణామాలు తెలుసుకున్న ఉద్యోగులు మాత్రం “విధి అంటే ఇలానే ఉంటుంద“ అని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.