వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా రు. ఈ క్రమంలో ఆయన అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. అమలాపురంలో నిర్వహించిన వారాహి యాత్ర, అనంతరం సభలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన నినాదం.. ప్రజల్లోకి జోరుగా వెళ్తోందని జనసేన నాయకులు చెబుతున్నారు. “హలో ఏపీ.. బైబై వైసీపీ“ నినాదాన్ని పవన్ ప్రజల్లోకి వదిలారు.
ఆయన చేసిన ఈ నినాదంపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. మంచి నినాదం అని కొందరు అంటే.. ప్రస్తుత పరిస్థితికి ఈ నినాదం అద్దం పడుతోందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇదే నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని జనసేన నాయకులు రెడీ అయ్యారు. ఇదిలావుంటే… అమలాపురం సభలో పవన్ మాట్లాడుతూ.. జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని అన్నారు.
పవన్ కల్యాణ్, జనసేన నాయకులు వస్తున్నారంటే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడుతున్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహిస్తోందంటూ పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై అమిత్‌షాకు చెప్పినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రజలు బాగుండాలంటే.. వైసీపీని తరిమికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ‘హలో ఏపీ.. బై బై వైసీపీ’ అంటూ కొత్త నినాదం ఇచ్చారు.
జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని… అయితే, అభిప్రాయ సేకరణ పేరుతో వైసీపీ నేతలే గొడవలు సృష్టించారని ఆరోపించారు. అనంతరం జరిగిన గొడవల్లో 250 మందిని జైలులో పెట్టారని పేర్కొన్న పవన్.. జైలులో పెట్టిన అమాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గొడవలను పెంచేవారు నాయకులు కాదన్న పవన్ కల్యాణ్ గొడవలను తగ్గించే వారే నిజమైన నాయకులని పేర్కొన్నారు.
ఇప్పుడు ఇవే అంశాలపై జనసేన నాయకులు.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎం విషయాన్ని పక్కన పెట్టి.. ముందు.. జనసేనాని ఇచ్చిన నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. వారాహి యాత్ర ముగిసేలోగానే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పవన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ కమిటీలు.. హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనునట్టు సమాచారం.