రాజోలు, రాజా నగరం స్థానాల్లో జనసేన అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ ప్రకటనతో టీడీపీతో జనసేన పొత్తు గురించి కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. పవన్ ప్రకటనతో టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ-జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి హరిరామజోగయ్య లేఖ రాశారు.
నసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయించడం విఫల ప్రయోగమని, పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు 25-30 సీట్లు సరిపోవని అభిప్రాయపడ్డారు. పొత్తులో జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలు కేటాయించాలని అన్నారు. 2019లో జనసేన తరఫున బరిలోకి దిగి ఓటమిపాలైనవారు 2024 ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హరిరామజోగయ్య చెప్పారు.
జనసేన రాజకీయ ఎదుగుదలకు టీడీపీ అడ్డుగా ఉందా? పవన్ పెద్ద మనసుతో సర్దుకుపోవడమే కారణమా? అని ఆయన రాసిన లేఖ వైరల్ గా మారింది. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా టీడీపీకి ఎక్కువ సీట్ల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఆ సంకేతాలు జనసేన తరఫున పోటీ చేయాలనుకుంటున్న వారితోపాటు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నాయని అన్నారు.