రాజకీయాల్లో ఉన్న నాయకుడు ఎవరైనా.. తమకు న్యాయం జరగాలనే కోరుకుంటారు. ఆ న్యాయం వారి ఆశించే పదవులతోనే! అది వైసీపీ అయినా..టీడీపీ అయినా, జనసేన అయినా ఏ నాయకుడికైనా పదవులే కీలకం. ఇప్పుడు జనసేనలోనూ ఇదే చర్చసాగుతోంది.
తమకు ఎక్కడ సీటు ఇస్తారు? ఎలా ఇస్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకులను పరిశీలిస్తే.. బీసీలు, ఎస్సీలు తక్కువగానే ఉన్నారు. ఓసీ సామాజిక వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో జనరల్ సీట్లపై వీరు కన్నేశారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా తమకు మాత్రం సీట్లు ఇవ్వాలనే వారు కూడా జనసేనలో కనిపిస్తున్నారు. పైకి మాత్రం గంభీరంగా ఉన్నా… లోలోన మాత్రం వీరిని టికెట్ రగడ కలచి వేస్తోంది.
తాము కోరుకున్న సీటు ఇవ్వకపోతే ఎలా అనే చర్చ కూడా వీరి నుంచి వినిపిస్తోంది. విజయవాడ పశ్చిమ సీటును ఇప్పటికే జనసేనాని కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా విశాఖ ఎంపీ సీటును కూడా ఒకరి ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక, మెగా బ్రదర్ నాగాబాబుకు మళ్లీ నరసాపురం టికెట్‌ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కు ఈ సారి తెనాలి కాకుండా గుంటూరు వెస్ట్ అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొత్తగా వచ్చేవారికి కూడా సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అదేసమయంలో పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వీర మహిళలను ఎక్కువ సంఖ్యలో పోటీ పెడతారని అంటున్నారు.
వీరికి సంబంధించిన ప్రొఫైళ్లను నాదెండ్ల మనోహర్ తీసుకున్నారని ఆర్థికంగా అంతో ఇంతో బలంగా ఉంటే చాలని నిజాయితీ, విశ్వసనీయత అనే రెండు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఇదిలావుంటే.. మెగా అభిమానులు కూడా ఈ సారి జనసేనకు అండగా నిలుస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వారు ఒక తీర్మానం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో వారిని మరింత ప్రోత్సహించేందుకు రెండుస్థానాల్లో వారికి కూడా చోటుకల్పిస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఎంకు కేటాయించారు. ఈ సారి మెగా అభిమానికి ఈ టికెట్ కేటాయిస్తారని అంటున్నారు. వాస్తవానికి.. అక్కడ కూడా శోడిశెట్టి రాధా అనే యువ నాయకుడు పుంజుకున్నాడు.
సో.. ఆయనకైనా ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈనెల 30, 31న జరగనున్న కీలక సమావేశంలో టికెట్లపై కూడా పవన్ ప్రకటన చేయనున్నారని నాయకులు భావిస్తున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.