రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ.. రాజకీయంగా ఓ పార్టీ పెట్టి సంచలనం రేపిన.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పార్టీ జనసేన.. ప్రస్తుత రాజకీయ గోదాలో ఎక్కడ ఉంది? ఏమేరకు పుంజుకుంది? రాజకీయ రేటింగ్‌లో మార్కులు ఎన్ని కొల్లగొట్టింది? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. వ్యక్తులకైనా.. వ్యవస్థలో ప్రజలతో అనుసంధానం అయిన.. పార్టీలకైనా.. సింహావలోకనం అనేది కీలకం. గతాన్ని మరిచిపోకుండా.. వర్తమానానికి సోపానాలు వేసుకుని.. ముందుకు సాగితే.. లక్ష్యాన్ని చేరుకోవడం వీలవుతుందనేది మేధావుల మాట.
మరి ఈ నేపథ్యంలో జనసేన లక్ష్యం ఏమిటి? ఇప్పుడున్న పొజిషన్ ఏంటి? 2014 ఎన్నికలకు ముందు ప్రారంభించిన పార్టీ.. పట్టుమని పది సంవత్సరాలు కూడా గడవకముందే.. అనేక పిల్లిమొగ్గలు వేసింది. అతి ఆవేశం.. అతి ఆక్రోశం.. ఈ రెండు పనికిరావు. అయితే, వాటినే పట్టుకునిఈ పార్టీ అధినేత పవన్ వేలాడారు. ఎన్నికలకు ముందు.. తర్వాత.. ఆయన వేసిన అడుగులు.. చేసిన ఫీట్లు.. 2014లోను, 2019 తర్వాత.. కూడా పార్టీకి మేలు చేయకపోగా.. మరింతగా గ్రాఫ్‌ను తగ్గించాయి. ప్రస్తుతం తాజా ఎన్నికలు ముగిసి.. ఏడాదిన్నర అయిపోయింది. ఈ ఏడాదిన్నరలో జనసేన ప్రజలకు చేరువైందా? అంటే.. లేదనేది నిర్మొహమాటంగా చెబుతున్న సమాధానం.
2019లో ఏ పార్టీని తిట్టిపోశారో.. అదే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గత ఏడాది ఎన్నికల్లో కనీసం ఒక్కరైనా గెలిచి.. పార్టీ పరువును నిలబెట్టారో.. ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఇక, సీనియర్లు.. మేధావులు అంటూ.. తన పార్టీలో రెడ్ కార్పెట్ పరిచారో.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటివారిని కూడా పార్టీలో నిలబెట్టుకోలేకపోయారు. మహిళలకు వెన్నుదన్నుగా ఉన్న `వీరమహిళ` వంటి కమిటీలను ఏర్పాటు చేసి.. నిర్వీర్యం చేసింది కూడా ఈ పద్దెనిమిది మాసాల్లోనే. యువతను ఆకర్షించలేక పోవడం అనేది మరో ప్రధాన మైనస్.
ఇక, పార్టీలో అప్పటికప్పుడు స్పందించే నేతలు లేక పోవడం, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేకపోవడం వంటివి కూడా పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి. ఉంటే.. అదే పనిగా.. రాష్ట్రంలో ఉండడం, లేకపోతే.. హైదరాబాద్‌కే పరిమితం కావడం వంటివి కూడా జనసేన అధినేత పవన్‌పై మరకలు వేసేలా చేసింది. సెంటిమెంటును నమ్ముకున్నా.. దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వారిని తనవైపు తిప్పుకొనే క్రతువులో ఆయన సక్సెస్ అందుకోలేక పోయారు. ఈ ఏడాదిన్నర సమయంలో జనసేన సాధించిన గ్రాఫ్ ఇదే!! మరి ఇలా అయితే.. పార్టీ ఎప్పుడు పుంజుకుంటుందో.. పవనే ఆలోచించుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.