పేరుకుమాత్రమే బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. అయితే ఈ రెండుపార్టీలూ మిత్రపక్షాలుగా వ్యవహరించింది చాలా తక్కువనే చెప్పాలి. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి మిత్రపక్షాల బంధానికి రోజులు దగ్గరపడినట్లే ఉంది. ఒకవైపు బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు.
ఈ విషయంపై బీజేపీ నేతల్లో బాగా మంటుంది. అయితే బయటపడలేకపోతున్నారు. అలాంటిది మొదటిసారి పీవీఎన్ మాధవ్ జనసేన బంధంపై మండిపడ్డారు.
అసలు తమరెండు పార్టీలు మిత్రపక్షాలనే అన్న అనుమానం వ్యక్తంచేశారు. తమకు ఏ ఎన్నికలోను పవన్ సహకరించలేదని డైరెక్టుగానే చెప్పారు. మొన్నటి ఎంఎల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో సహకరించమని కోరినా తమను పట్టించుకోలేదని నిష్టూరంగా చెప్పారు.
మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలతో కమలనాదుల్లో ఎప్పటినుండి లోలోపలున్న మంట ఒక్కసారిగా బయటపడినట్లయ్యింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పవన్ పొత్తుపెట్టుకోవటం ఖాయమనే అనిపిస్తోంది.
బీజేపీ నేతలు కూడా ఈ విషయమై మానసికంగా సిద్ధపడిపోయారు. అయితే తమంతట తాముగా పొత్తును తెంచుకోవటం ఇష్టంలేదు. ఆ పనేదో పవన్ అంతట పవనే చేసుకుంటే తమకు ఇబ్బందులుండవని కమలనాదులు వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల రూపంలో వచ్చినట్లయ్యింది. అందుకనే పవన్ పై బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. మాధవ్ చేసిన ఆరోపణల్లో అబద్ధమేమీలేదు. ఎందుకంటే పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయద్దని చెప్పారే కానీ బీజేపీకి వేయమని మాత్రం చెప్పలేదు.
ఇదే విషయాన్ని మాధవ్ మీడియాతో చెప్పారు. దీన్ని ఖండించటానికి కూడా పవన్ దగ్గర కానీ జనసేన నేతల దగ్గర కానీ ఏమీలేదు. కాబట్టి మాధవ్ వ్యాఖ్యలపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది.
నిజానికి రెండుపార్టీలకు పొత్తుబంధం నుండి బయటపడాలనే అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. కాకపోతే ఆ పని ఏ ముందుచేస్తుందా అన్న విషయమై రెండో పార్టీ ఎదురుచూస్తోంది. జనసేనతో కలిసుండటం వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టంలేదు. ఇదే సమయంలో బీజేపీతో కలిసుంటే పవన్ నష్టపోతారు. అందుకనే రెండు పార్టీలూ రెండోపార్టీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది.