ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘జన నాయకుడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, ప్రజలకు హామీలను వివరించి ఓట్లు వేయించారని గుర్తు చేసుకున్నారు. వారి కష్టం వృథా కానివ్వబోనని, వారి భవిషత్తుకు భరోసా తనది అని అన్నారు.
అందుకే, కార్యకర్తల ద్వారా వచ్చిన వినతులు నేరుగా తనకు తెలియాలనే ఉద్దేశ్యంతో ‘జన నాయకుడు ’ కార్యక్రమం రూపొందించామని, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా చూస్తున్నామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. పార్టీకి సంబంధిత సమస్యలు, ప్రభుత్వ సంబంధిత సమస్యలు సమానంగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులే ఇస్తున్నారని అన్నారు.
ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి తానే స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని అన్నారు. కుప్పంలో పర్యటనకు వచ్చినపుడు ఫిర్యాదులు లేకుండా చూడాలన్నదే ఈ ‘‘జన నాయకుడు’’ లక్ష్యమని అన్నారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, జగన్ ప్రభుత్వం వ్యవస్థలను ధ్వంసం చేసిందని, దాని నుంచి బయట పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. మీడియాపై రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని, వాటిని మాఫీ చేసేందుకు ప్రత్యేక జీఓ తెచ్చే విషయాన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.