ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికలపై కృత నిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. దేశమంతా ఒకే ఎన్నికలు అనే నినాదంతో మోడీ ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సారి 2023లోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలపై పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ కార్యకర్తలు, నేతలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు గతంలో పలుమార్లు పిలుపునిచ్చారు. తాజాగా కడప పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు జమిలి ఎన్నికలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు తమ్ముళ్లంతా జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, వైసీపీ పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి పోలైన 10 ఓట్లలో 5 ఓట్లు టీడీపీకి రావాలని, ఆ విధంగా కార్యకర్తలంతా ముందుకు పోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలనాడి తెలుసుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, నేతలంతా కష్టపడాలని, టీడీపీ ఓటుబ్యాంకును పదిలం చేసే వ్యూహంతో ముందుకు పోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు సత్తా చాటాలని అన్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు జమిలీ ఎన్నికల గురించి పలుమార్లు ప్రస్తావిస్తున్నారు.
అయితే, జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. కానీ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి చాణక్యుడు జమిలి ఎన్నికలపై ఇంత నమ్మకంగా ఉండడంపై పలువురు నేతలు ఆరా తీస్తున్నారు. చంద్రబాబుకు జమిలి ఎన్నికలు రాబోతున్నాయని స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే ఆ దిశగా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారని పలువురు అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలోనూ చంద్రబాబుకు పరిచయాలుండడం, పలువురు జాతీయ స్థాయి నేతలతో చంద్రబాబు టచ్ లో ఉంటున్న నేపథ్యంలో జమిలి వ్యవహారం సీరియస్ గానే పరిగణించాలని అంటున్నారు. ఏదో ఒక చిన్న లీక్ లేనిదే చంద్రబాబు జమిలి ఎన్నికలపై అంత కాన్ఫిడెంట్ గా ఉండరని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అయితే, చంద్రబాబు నోట జమిలి మాట రావడం వెనుక మరికొన్ని కారణాలున్నాయని కొందరు అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి,నియోజకవర్గ స్థాయి నేతలు కూడా టీడీపీకి దొరకడం లేదన్న వాదన వినిపిస్తోంది. జంప్ జిలానీలు ఒకవైపు…పార్టీలో ఉన్నా లేనట్టు ఉండే నేతలు మరోవైపు….దీంతో, ఉన్న కేడర్ ను కాపాడుకునేందుకు చంద్రబాబు జమిలి ఎన్నికల వ్యవహారం తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయంటే కేడర్ లోనూ ఉత్సాహం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై చంద్రబాబు ప్రచారం పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది వేచి చూడాలి.