జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి పలు దిగ్గజ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ స్థాయి దుస్తుల తయారీ సంస్థ జాకీకి చెందిన కంపెనీ ఒకటి ఆంధ్రా నుంచి తెలంగాణకు తరలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలున్నా జాకీ దుస్తులను తయారు చేసే పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థ ఆంధ్రాను వద్దనుకొని తెలంగాణలో తిష్ట వేసింది. వేలాది మందికి ఉపాధి కల్పించగలిగిన ఈ పరిశ్రమను ఏపీలో పెట్టేందుకు ఆ సంస్థ గతంలోనే ముందుకు వచ్చింది.
అందుకు సంబంధించిన స్థల కేటాయింపులు తదితర అనుమతులు సన్నాహాలు అన్ని పూర్తయ్యాయి. అయితే, నా సంగతేంటి అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. తన మామూలు తనకు చెల్లిస్తేనే మిగతా పనులు ముందుకు సాగుతాయి అంటూ తన డిమాండ్ల చిట్టాను ఆ ప్రజా ప్రతినిధి చెప్పారు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు హడలిపోయారు. కంపెనీ మొదలు పెట్టక ముందే రాజకీయ ఒత్తిళ్లు ఈ రేంజ్ లో ఉంటే కంపెనీ మొదలుపెట్టి తమ ఉత్పత్తులను ప్రారంభించిన తర్వాత ఇంకెన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ను సంప్రదించారట.
దీంతో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆ సంస్థకు కేటీఆర్ రెడ్ కార్పెట్ పరిచారట. దీంతో, తెలంగాణలో ఒకటికి బదులు రెండు యూనిట్లు స్థాపించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇబ్రహీంపట్నం, ములుగులో రెండు యూనిట్లు స్థాపిస్తున్నామని ప్రకటించింది. వాస్తవానికి టిడిపి హయాంలో రాప్తాడు వద్ద ఈ సంస్థకు 27 ఎకరాలను ఆనాటి టిడిపి ప్రభుత్వం కేటాయించింది. 129 కోట్ల పెట్టుబడితో 6420 మందికి నేరుగా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ సంస్థకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు.
అయితే 2019 ఎన్నికల్లో రాప్తాడులో వైసిపి నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సీన్ మారిపోయింది. ఆ సంస్థ ప్రతినిధులను తోపుదుర్తి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తనకు ఎన్నికల్లో 20 కోట్లు ఖర్చయిందని, 10 కోట్లు మీ సంస్థ తరఫున ఇవ్వాలని తోపుదుర్తి డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ గోలంతా మాకెందుకు అనుకున్న ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణకు తరలిపోయినట్టుగా తెలుస్తోంది.
ఇక తాను చెప్పిన వారికే కంపెనీ సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని కూడా తోపుదుర్తి హుకుం జారీ చేశారట. దీంతో, మీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని మీరు తీసేసుకోండి అంటూ ఆ కంపెనీ ఒక దండం పెట్టి రాష్ట్రం నుంచి తరలిపోయిందట.