వినేవాళ్లుండాలే కానీ.. అధికారంలో ఉన్న వారు ఏమైనా చెబుతారు. కొండకు నిచ్చెనవేశామంటారు.. ఆకాశానికి ఎగబాకామని కూడా చెబుతారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే చెప్పారు. ఆయన తరచుగా అనేక ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యానికి తోడు టీడీపీ-జనసేనలు కలిసి ముందుకు సాగుతున్న క్రమంలో సీఎం జగన్ తన మాటలకు మరిన్ని హంగులు జత చేశారు.
తాజాగా నూజివీడులో నిర్వహించిన అసైన్డ్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తన పాలన కాలంలో(నాలుగున్నరేళ్లలో) 2.07 లక్షల `శాశ్వత` ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు వరకు కేవలం 4 లక్షల మందికి ఏపీలో శాశ్వత ఉద్యోగాలు లభించాయని.. అయితే.. దీనిలో సగం ఉద్యోగాలను నాలుగేళ్లలోనే తాను ఇచ్చానని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ఈ 2.07 లక్షల ఉద్యోగాల్లో 80 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చినట్టు జగన్ ఉవచించారు. సామాజిక న్యాయాన్ని నరనరానా నింపుకొన్న పార్టీ వైసీపీ అని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు మరో 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా పలికారు. మొత్తంగా .. వినేవారు ఉండాలే కానీ.. జగన్బాగానే చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవం ఇదీ..
జగన్ చెప్పిన మాటలు పక్కన పెడితే.. ఏపీలో వాస్తవం ఏంటంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. 4 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరు శాశ్వత ఉద్యోగులు కారు. ఎంపీడీవోకు కోపం వచ్చినా.. ఆఖరుకు ఎమ్మెల్యేకు ఆగ్రహం వచ్చినా.. వలంటీర్ ఇంటికే. ఇక, సచివాలయాల ఏర్పాటు ద్వారా కల్పించిన శాశ్వత ఉద్యోగాలు.. 56 వేలు. గ్రూప్-1(చంద్రబాబు హయాంలో వేసిన నోటిఫికేషన్) ద్వారా 247 ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు వైసీపీ హయాంలో గ్రూప్ ఉద్యోగాల భర్తీ లేకుండా పోయింది. ఇక, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 547 రిక్రూట్ చేశారు. తాజాగా ఎస్సై పోస్టులను భర్తీ చేయాలని అనుకున్నా.. కోర్టుల చిక్కులతో అవి ముందుకు సాగడం లేదు.