వివేకా హత్య కేసులో తాజాగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో సంచలన విషయాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు సాక్షిగా పేర్కొన్నారు. ఆ చార్జిషీట్లో కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలం పొందుపరిచారు. ఆ వాంగ్మూలంలో ఆయన సంచలన వివరాలు వెల్లడించారు. వివేకా హత్య జరిగిన రోజు తాను సీఎం జగన్ తో ఓ కీలక భేటీలో ఉన్నానని, ఆ సమయంలో జగన్ అటెండర్ నవీన్ తలుపు తెరచి తనను బయటకు పిలిచారని కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఫోన్లో అవినాష్ రెడ్డి లైన్లో ఉన్నారని, వివేకానంద రెడ్డి చనిపోయిన విషయాన్ని తనకు చెప్పాడని అన్నారు.
బాత్రూంలో మృతదేహం ఉందని అవినాష్ తనతో చెప్పారని, చాలా రక్తం కూడా బాత్రూంలో ఉన్న విషయాన్ని చెప్పారని, ఆ సమాచారం జగన్ కు చేరవేయాలని అవినాష్ ఫోన్ పెట్టేశారని గుర్తు చేసుకున్నారు. వివేకా చనిపోయిన విషయాన్ని జగన్ కు తాను చెవిలో చెప్పానని, జగన్ ముందు ఇంటికి వెళ్లి ఆ తర్వాత పులివెందుల వెళ్లారని గుర్తు చేసుకున్నారు. జగన్ పర్యటన కోసమే అవినాష్ తో అన్ని సార్లు ఫోన్లో మాట్లాడి ఉంటానని అన్నారు. అయితే, జగన్ ఫోన్ వాడరని, పీఏ ఫోన్ లేదా తన ఫోన్ లోనే మాట్లాడుతారని ఆయన అధికారులకు వివరించారు.
మరోవైపు, సీఎం జగన్ అటెండర్ నవీన్ వాంగ్మూలాన్ని కూడా సీబీఐ అధికారులు తాజాగా చార్జిషీట్లో పొందుపరిచారు. హత్య జరిగిన రోజు ఉదయం 6:30కు అవినాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి జగన్ ఉన్నారా అని అడిగారని వాంగ్మూలంలో నవీన్ పేర్కొన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, జివిడిలతో జగన్ సమావేశంలో ఉన్నారని తాను చెప్పినట్లుగా, కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వాల్సిందిగా అవినాష్ రెడ్డి కోరినట్లుగా వాంగ్మూలమిచ్చారు. దాంతో, సమావేశం జరుగుతున్న గదిలోకి వెళ్లి కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.
అయితే, అవినాష్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయం వినలేదని వివరించారు. అయితే, ఈ ఛార్జిషీట్ జూన్ 30న కోర్టుకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. అది ఇంత ఆలస్యంగా ఎందుకు వెలుగులోకి వచ్చింది అన్న విషయంపై చర్చ జరుగుతోంది.