ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖజానాలోని నిధులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటనల నుంచి మొదలు…ఇతరత్రా అనవసర ఖర్చులతో ఖజానాకు చిల్లు పడుతోందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, తాజాగా ఏడాదికి టీ, బిస్కెట్లపై జగన్ సర్కార్ దుబారా చేస్తోందంటూ సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గణాంకాలతో సహా వెల్లడించారు. రాష్ట్ర ప్రొటోకాల్ శాఖలో నిధుల దుర్వినియోగం జరిగిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆయన లేఖ రాశారు.
ప్రభుత్వంలోని ప్రముఖుల అధికార లేదా అనధికార పర్యటనల సందర్భంగా బస, భోజనం, రవాణా వంటి వ్యవహారాలను ఈ శాఖ పర్యవేక్షిస్తుందని, ఆ శాఖ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్ పద్దు 132 కింద ఇతర ఖర్చుల పేరుతో ఈ రూ.8 కోట్ల లెక్క ఉందని, సమావేశాల్లో టీ, బిస్కెట్ల కోసం ఏడాది కాలంలో రూ.8 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.2 లక్షల ఖర్చయిందని అన్నారు.
ప్రొటోకాల్ డైరెక్టర్‌కు ప్రభుత్వ వాహనాలున్నప్పటికీ ప్రముఖులు వచ్చినప్పుడు ఖరీదైన వాహనాలను అద్దెకు తీసుకుంటున్నట్లు చూపుతున్నారని వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కార్ల అద్దె కోసం బడ్జెట్ పద్దు 134 కింద రూ.8.9 కోట్లు కేటాయించారని వివరించారు. ఈ రెండు పద్దుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నిధుల దుబారాపై విజిలెన్స్ లేదా ఏసీబీతో విచారణ జరిపించేలా ఆదేశించాలని గవర్నర్ కు రాసిన లేఖలో పద్మనాభ రెడ్డి కోరారు.