- జగన్ తీరుతో పరిశ్రమ బెంబేలు
- థియేటర్లలో టికెట్ ధరలు అడ్డగోలుగా తగ్గింపు
- టాయ్‌లెట్ రుసుము కంటే తక్కువగా ఖరారు
- పేదలకు చౌకగా వినోదం అందాలట!
- ఐదో ఆటకు నిరాకరణ దాంతో కాళ్లబేరానికి సినిమా పెద్దలు
- తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రితో భేటీ
- జగన్ గొప్పతనమంటూ జేజేలు
కొంగొత్త ఆలోచనలతో.. కొత్తవో పాతవో కథలను తీర్చిదిద్ది.. దేశవిదేశాల్లోని ఆకర్షణీయ ప్రదేశాల్లో, స్టూడియోల్లో భారీ సెట్టింగులతో సినిమాలను తెరకెక్కించే సినిమా దర్శకులు, హీరోలకు, నిర్మాతలకే సీఎం జగన్మోహన్రెడ్డి సినిమా చూపిస్తున్నారు. తాను తలచుకుంటే వారిని ఆర్థికంగా దెబ్బతీయగలనని చెప్పి మరీ చేస్తున్నారు. కాళ్లబేరానికి తెచ్చుకుంటున్నారు.
ప్రభుత్వాలు సినిమా రంగానికి తొలినుంచీ కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నాయి. థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, కొత్త సినిమాలకు ఐదో ఆటకు అనుమతి ఇచ్చేవారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేలటికెట్ నుంచి రిజర్వుడు కేటగిరీ వరకు ఒకటే రేటు వసూలు చేసే అవకాశం ఉండేది. దీంతో వారం పది రోజుల్లోనే ఖర్చులు వచ్చేవి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విశ్వవ్యాప్తంగా ఇలాగే జరుగుతుంటుంది. అయితే ఈ ‘దోపిడీ’కి అడ్డుకట్ట వేయాలని జగన్ భావించారు. మొదట పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. ఆయన సినిమా వకీల్ సాబ్ విడుదలకు నానా ఇబ్బందులు సృష్టించారు. ఐదో ఆటకు, బెనిఫిట్ షోకు అంగీకరించలేదు. ఆ తర్వాత ప్రభుత్వమే ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తుందని ప్రకటించారు.
మొన్న సంక్రాంతికి ముందు పెద్ద హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో.. సినిమా పెద్దలతో దాసోహం అనిపించుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇన్నాళ్లూ లేనిది.. అకస్మాత్తుగా పేదలకు వినోదం చౌకగా అందించాలని అనుకున్నారు. అంతే.. థియేటర్లలో టికెట్ల ధరలు ఎంతెంత ఉండాలో ఏకపక్షంగా నిర్ణయించి జీవో విడుదల చేసేశారు. దానిప్రకారం.. గ్రామాల్లో నాన్ ఏసీ థియేటర్లలో నేల టికెట్ రూ.5, బెంచ్ రూ.10, కుర్చీ/రిజర్వుడు ధర రూ.15గా నిర్ణయించారు. అదే ఏసీ థియేటర్లయితే రూ.10, రూ.15, రూ.20గా, మల్టీప్లెక్స్లుంటే రూ.30, 50, 80గా నిర్ధారించారు. పట్టణాల్లో నాన్ ఏసీ అయితే రూ.15, 30, 50గా.. ఏసీ థియేటర్లలో రూ.30, 50, 70గా.. మల్లీప్లెక్స్లయితే రూ.60, 100, 150గా నిర్ణయించారు. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ఏసీ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.150గా ఉండేది. జగన్ సర్కారు మూడు రేట్లు రూ.40, 60, 100గా నిర్ణయించింది. మల్లీప్లెక్స్‌ల్లో రూ.75, 150, 250గా నిర్ధారించింది. మల్టీప్లెక్స్ ధరల్లో పెద్దగా మార్పు లేదు.
కాళ్ల భేరంతో రాజమౌళికి గిట్టు బాటు
పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే దాకా జీవో ఆపేసి ఆ సినిమా విడుదలైన వెంటనే రేట్లు మార్చేశారు. ప్రభాస్ రాధేశ్యామ్ కు కొన్ని వెసులు బాట్లు ఇచ్చారు. అదే రాజమౌళి సినిమా దగ్గరకు వచ్చేసరికి వంద శాతం వెసులు బాటు ఇచ్చేశారు. పేదలకు తక్కువ రేటుకు వినోదం వద్దా అని ఇపుడు ఆ పేదల నోట్లో సున్నం పోశారు. రాజమౌళి సినిమా టిక్కెట్ ఏపీలో 150 పైనే. భీమ్లా నాయక్ కి 15 … రాజమౌళి సినిమాకు 150 ఏమైనా న్యాయంగా ఉందా?
గిట్టుబాటు కాక వాయిదా..
పవన్ సినిమా విడుదలయ్యే దాకా ఏపీలో అనేక విచిత్రాలు జరిగాయి. టాయిలెట్ రుసుము కంటే తక్కువగా టికెట్ ధరను జగన్ సర్కారు నిర్ణయించడంతో ఎగ్జిబిటర్లు గగ్గోలుపెట్టారు. ఈ ధరలతో కనీసం కరెంటు ఖర్చులు కూడా రావని వాపోయారు. నోరెత్తినవారి థియేటర్లపై అధికారులు దాడులు చేసి మూసివేయించారు. దీంతో నిర్మాతలు, హీరోలు బిత్తరపోయారు.
కొందరు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసినా ఫలితం లేకపోయింది. సినిమా పెద్దలెవరికీ ఏమీ పాలుపోలేదు. చివరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, ప్రభాస్ ‘రాధేశ్యాం’ వంటి సినిమాల విడుదలను వాయిదావేశారు. అయితే ధరల తగ్గింపుతో తనకు ఇబ్బంది లేదని ప్రకటించిన నాగార్జున.. ధైర్యంగా తన బంగార్రాజు సినిమాను విడుదల చేశారు. ఆంధ్రలో బాగానే నష్టపోయారని వార్తలు వచ్చాయి. అనవసరంగా సినిమాలు విడుదల చేసి నష్టపోవడం కంటే… తెచ్చిన రుణాలకు కొంతకాలం వడ్డీలు కట్టుకోవడం మేలని భావించిన నిర్మాతలు ఉగాదికి వాయిదా వేసుకున్నారు.
సమస్య పరిష్కారానికి సినిమా పెద్దలెవరూ ముందుకు రాకపోవడంతో.. జగనే రంగంలోకి దిగారు. చిరంజీవిని తాడేపల్లి పిలిపించుకుని చర్చించారు. ఏమీ తేలలేదు. పైగా చిరంజీవి వైసీపీలో చేరతారని.. ఆయనకు జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వజూపారని, పవన్ ఏకాకి అయ్యారని, కుటుంబంలోనే ఆయనకు మద్దతివ్వడం లేదని జగన్ సొంత మీడియా, అనుకూల మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి.
రాజకీయాల్లోకి ఇక రానని… సినిమాలకే తన జీవితం అంకితమని ఇప్పటికే ప్రకటంచిన చిరంజీవి ఈ ప్రచారం చూసి బిత్తరపోయారు. జగన్‌తో చర్చల్లో ఇదేమీ ప్రస్తావనకు రాలేదని.. రాజ్యసభ సీటు ఎరవేస్తే లొంగే మనిషిని కానని బహిరంగంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సహచరులెవరూ రాకుండా ఒక్కరే చర్చలకు వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. అటు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సినీ వర్గాలతో చర్చలు జరుపుతూనే ఉంది. ధరలపై నిర్ణయం అదిగో ఇదిగో అంటూ కోర్టులోనూ ప్రభుత్వం నాన్చుతూ వస్తోంది.
సమస్యలు సృష్టించి..
మంత్రి పేర్ని నాని చొరవతో ఈ నెల 10న సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు తాడేపల్లిలో జగన్‌తో సమావేశమయ్యారు. మిగిలిన అన్ని అంశాల సంగతేమిటోగానీ… ‘ఐదో షో’కు సీఎం ఆమోదం తెలిపారని సినీ పెద్దలంతా సంబరపడిపోయారు. వెరసి.. సినిమా వాళ్లకు ప్రభుత్వం పది సమస్యలు సృ ష్టించి, ఒకటి రెండు మాత్రం పరిష్కరించిందన్న మాట! అత్యంత కీలకమైన టికెట్ ధరల అంశం తేల్చలేదు. మరి ఈ చర్చల్లో సాధించిందేమిటో అర్థం కావడంలేదని సినీ వర్గాల్లే విస్తుపోతున్నాయి.
చర్చల అనంతరం… సమస్యలన్నీ పరిష్కారమైపోయాయని చిరంజీవి ఆనందంగా చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి సమాచార శాఖ విడుదల చేసిన వీడియోలో జగన్ ప్రసంగాన్ని పరిశీలిస్తే.. విషయం అంత తేలిగ్గా తేలేలా లేదని తేలిపోయింది. ‘మీరు తండ్రిలాంటి స్థానంలో ఉన్నారు. సినీ పరిశ్రమపైన చల్లని చూపులు చూడాలని చేతులు జోడించి అడుగుతున్నాం’ అని జగన్‌తో భేటీ సందర్భంగా చిరంజీవి అన్నారు. అయినా సరే… టికెట్ ధరలపై జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
సినిమా రంగానికి తానే సృష్టించిన అనేక సమస్యలను అలాగే ఉంచేసిన జగన్ సర్కారు… ‘ఐదో ఆటకు ఓకే’ అని చెప్పింది. పెద్ద సినిమాలకు వారంరోజులు ప్రత్యేక ధరలు నిర్ణయిస్తామని తెలిపింది. దీంతో సినీ ప్రముఖులు సంబరపడిపోయి, ‘సర్కారు సానుకూల దృక్పథాన్ని’ తెగపొగిడి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత కిక్కురుమంటే ఒట్టు!
అనేక అస్త్రాలు..
సినీపెద్దలకు తానేంటో చూపించాలనుకున్న జగన్ ఇప్పటికే అనేక అసా్త్రలు ప్రయోగించారు. 10వ తేదీ నాటి చర్చలకు కొందరికే ఆహ్వానాలు పంపారు. స్వయానా బంధువైన మోహన్‌బాబునూ పిలవలేదు. నాగార్జున, తారక్ వస్తారని ప్రచారం జరిగినా.. వారు రాలేదు. సినీ ప్రముఖులు రాకముందే తనకు అనుకూలంగా ఉన్న అలీ, ఆర్.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళిని సీఎం పిలిపించుకున్నారు.
వీరు కొద్దిసేపు సీఎంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత అందరితో కలిసి చర్చల్లో పాల్గొన్నారు. వెరసి.. ‘పెద్ద’ హీరోలకు జగన్ ఇలా చిన్నపాటి ఝలక్ ఇచ్చారన్న మాట. ఈ చర్చల సందర్భంగా పోసాని పెద్ద హీరోలను టార్గెట్ చేశారు. వారు భారీ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ తగ్గుతుందని ఆవేశపూరితంగా అన్నారు.
చర్చకు సంబంధంలేని అంశంపై మాట్లాడడంతో చివరకు జగనే ఆయన్ను వారించినట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న సినిమాలకు ఆదరణ, బతుకుదెరువు ఉండాలని నారాయణమూర్తి కోరారు. తద్వారా పెద్ద హీరోలపై చిన్న సినిమాలను ప్రయోగించారన్న మాట. తనను పిలవనందుకు మోహన్‌బాబు అలకపూనినట్లు తెలియడంతో పేర్ని నాని హైదరాబాద్ వెళ్లి ఆయనతో భేటీ కావడం గమనార్హం.
జగన్ ఏమన్నారంటే..
సినీ పెద్దలతో భేటీలో జగన్ ఒకే అంశంపై రకరకాలుగా మాట్లాడారు. ‘పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలకు న్యాయం జరగాలి. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకటే రేటు ఉండాలి. ఈ పాయింట్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నాం. మంచి రేట్లు అనేవి అందరికీ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కో రేట్లు ఉండవు. బడ్జెట్లో ిహీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ ప్రామాణికం కాదు.
భారీ నిర్మాణ ఖర్చు, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్‌తో ముందుకొచ్చే సినిమాలకు వేరే ట్రీట్మెంట్ ఉండాలి. భారీ బడ్జెట్ సినిమాలకు వారం రోజుల పాటు ప్రత్యేక ధరలు నోటిఫై చేయిస్తాం. మల్టిప్లెక్స్‌లకు మంచి ధరలు ఇస్తాం’ అని చెప్పారు. వాస్తవానికి తక్కువ ఖర్చుకే వినోదం పేరిట.. మల్టిప్లెక్స్‌లలోనూ టికెట్ ధరలు తగ్గించారు.
ఇప్పుడు… పెంచుతామంటున్నారు. కొత్తగా చేసిందేమిటో తెలియదు. సినిమా బడ్జెట్లో హీరో, హీరోయిన్, డైరెక్టర్ల పారితోషికమూ భాగమే! కానీ దానిని మినహాయించాలనడం అసలు మలుపు. అసలు జగన్ మనసులో ఏముంది.. ఏమాశించి సినీ పరిశ్రమను టార్గెట్ చేశారు.. రేపు ఎలాంటి ధరలు ప్రకటిస్తారు.. అసలు ఉగాదికి ముందు ప్రకటిస్తారా.. తమ సినిమాలు విడుదలవుతాయా అని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.