ఏపీలో పీఆర్సీ రచ్చపై ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగులు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేస్తే సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేయగా….కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేాకాదు, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ట్రెజరీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమేనని, అందుకే జీతాలను ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ శాఖ ఉద్యోగులు పట్టుబట్టి కూర్చున్నారు. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులకు షాకిచ్చేలా జగన్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల జీతా తక్షణమే ప్రాసెస్ చేయాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. జీతాలు ప్రాసెస్ చేసెయ్యాలని ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలిచ్చినా జీతాలు ప్రాసెస్ కాలేదని, అందుకే మెమోలు జారీ చేశామని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రకారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
బిల్లులు ప్రాసెస్ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.
విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, ట్రెజరీ ఉద్యోగులు ఇరకాటంలోపడ్డారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకే ట్రెజరీ ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతుగా ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా ముందుకు వస్తున్న తరుణంలో రెవెన్యూ శాఖతో అనుబంధం ఉన్న తాము వెనక్కు తగ్గేదేలే అని ట్రెజరీ శాఖ ఉద్యోగులు అంటున్నారని తెలుస్తోంది.