ఆంధ్రప్రదేశ్లో హఠాత్తుగా రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి పది మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలను నిషేధిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి సభలు, రోడ్ షోలకు సరైన భద్రత ఏర్పాట్లు చేయడం మాని.. పూర్తిగా వాటి మీద నిషేధం విధించడం ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్నాక ఓవైపు ముఖ్యమంత్రి జగన్ రోడ్ షోకు మాత్రం అనుమతులు వచ్చేశాయి. కానీ కుప్పంలో చంద్రబాబు రోడ్ షోను మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో సినిమా వేడుకలకు సైతం అనుమతులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ శుక్రవారం నాడు ఒంగోలులోని ఓ మైదానంలో సంక్రాంతి సినిమా వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. రెండు వారాల ముందే అనుమతులు తీసుకున్నారు. రెండు రోజుల కిందటే ఈవెంట్కు ఏర్పాట్లు మొదలయ్యాయి. కానీ బుధవారం నిర్వాహకులకు పెద్ద షాక్ తగిలింది. ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ ఒంగోలు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయింది వీరసింహారెడ్డి టీం.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్లో జరగాల్సిన ఆ సినిమా ఈవెంట్కు కూడా అనుమతి నిరాకరించారట. ఇవి కూడా రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయాలే అనే చర్చ నడుస్తోంది. ఇలా ప్రతిపక్ష పార్టీల నేతలు.. ఆ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన సినిమాల వేడుకలకు అనుమతులు ఇవ్వకపోవడం ఏం న్యాయమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.