ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై కొత్త వాదన అందుకున్నారు. పరమపవిత్రమైన స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపణ చేయడంతో.. దేశవ్యాప్తంగా ఈ అంశం పెను సంచలనం రేపింది. అయితే లడ్డూ కల్తీపై స్వతంత్ర దర్యాప్తు కావాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరు నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ విచారణ జరగక ముందే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదంతా జగన్ డైరెక్షన్ లోనే జరిగింది.
ఈలోగా కూటమి సర్కార్ ఒక సిట్ ను ఏర్పాటు చేయగా.. సుప్రీం సూచన మేరకు డీజీపీ ఆ సిట్ ను రద్దు చేశారు. అందుకు జగన్ తెగ సంబరపడిపోయారు. కానీ ఆయన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వైసీపీ నేతలు వేసిన పిటీషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తీర్పు వెల్లడించింది. జగన్ కోరుకున్నట్లుగానే ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అందులో సీబీఐ అధికారులు ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు. కానీ సీబీఐ సిట్ లో ఇద్దరు ఏపీ పోలీసులను నియమించడంతో.. జగన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా ముందుకు వచ్చి మరీ సుప్రీం తీర్పుపై భిన్నమైన కామెంట్స్ చేశారు. సిట్టూ…బిట్టూ అవసరమే లేదంటూ మాట మార్చేశారు. `టీటీడీలో మూనాల పరిశీలనకు ఒక ప్రక్రియ ఉంది. అసలు సిట్టు, బిట్టు అవసరం లేదు. ఏం జరగలేదని కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు.. ఈ ఆధారాలన్నీ చూసి అక్కడ ఏమీ జరగలేదనే చెబుతారు` అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగకుండా `రాజకీయ స్వార్థం కోసం తప్పుడు నివేదిక రెడీ చేస్తే ఊరుకోమని.. వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది. ఆయనే చూసుకుంటారు` అంటూ కామెంట్స్ చేశారు. అంటే ఒకవేళ సీబీఐ సిట్ తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వకపోతే.. దాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని జగన్ ముందే పరోక్షంగా చెప్పేశారు. దేశవ్యాప్తంగా లడ్డూ వివాదం సంచలనం రేపుతుంటే.. అసలే విచారణే అవసరం లేదని, ఏ తప్పు జరగలేదని జగన్ చెప్పడం ఇప్పుడు విడ్డూరంగా మారింది. సీబీఐ సిట్ రిపోర్ట్ వస్తే తాను దొరికిపోతానన్న భయంతోనే జగన్ ఇలా మాట మారుస్తున్నారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.