సాధారణంగా పాఠశాలల్లో జాతీయ నాయకుల ఫొటోలు.. పెడతారు. ఎందుకంటే వారు ఈ దేశానికి చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు, చిన్న వయసులోనే దేశ భక్తి, స్వాతంత్య్ర సంగ్రామం గురించి పిల్లలకు తెలిపేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే.. రాష్ట్రంలో స్వామి భక్తి పరాయణులు పెరిగి పోయారు. దీంతో సీఎం జగన్ ఏం చెప్పినా.. చెప్పకపోయినా.. తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఏపీలో ఒక అధికారి.. “పాఠశాలల్లో.. జననేత జగన్ ఫొటో ఉండాలి“ అని మౌఖిక ఆదేశాలు ఇచ్చారట. అంతేకాదు… ఫొటోలకు ఖర్చును హెచ్ ఎంలు.. టీచర్లు పెట్టుకోవాలని కూడా టెలి ఫోన్ సంభాషణల్లోనే హుకుం జారీ చేశారని ఉపాధ్యాయ వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. అయితే.. ఇది రచ్చ అవుతుందని ఎవరో ఆయనకు చెవిలో చెబితే.. హెచ్ ఎంల రూముల్లో అయినా.. పెట్టాల్సిందేనని ఆదేశాలు గట్టిగానే జారీ చేశారట.
అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ను అభిమానించే వారు.. తమ తమ కార్యాలయాల్లో ఇప్పటికే జగన్ ఫొటో పెట్టేసుకున్నారు. కానీ, తమకు వేతనాలు ఇవ్వడం లేదేని.. పీఆర్సీ అమలు చేయడం లేదని, సీపీఎస్ రద్దు చేయడం లేదని ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు మాత్రం.. ఇంకా ఫొటోలు కొనుగోలు చేయలేదు. దీంతో మళ్లీ.. తాను త్వరలోనే ఇన్స్పెక్షన్కు వస్తానని.. సదరు అధికారి హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే, సీఎం జగన్ ఫొటో పెట్టమనడంపై కొందరు ఉపాధ్యాయులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. “గాంధీ గురించి చెప్పాలంటే.. హిస్టరీ ఉంది. నెహ్రూ గారికీ హిస్టరీ ఉంది. అంబేద్కర్ గురించి చెప్పేందుకు కూడా పాఠాలు ఉన్నాయి. మరి జగన్ సర్ గురించి ఏం చెప్పాలి?“ అని అమాయకంగా వాట్సాప్ మెసేజ్లు పెడుతుండడం గమనార్హం. మరి ఇది వివాదంగా మారేలోగా ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.