విద్యార్థులకు విదేశీ సాయం సున్నా…పీజీలకు రీయింబర్స్మెంట్ ఎత్తివేత
సిమెంటు ధరలు పైపైకి…పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్నులు
నాసిరకం మద్యం.. అయినా ధర భారం
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎరగేసి.. ప్రజల జేబులు లూటీ చేస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. నవరత్నాలు, సంక్షేమం పేరిట ఇచ్చేదాని కంటే.. పన్నులు, ఇతరత్రా రూపంలో లాక్కోవడం ఎక్కువైఐంది. రూపాయి ఇచ్చి రెండు రూపాయలు గుంజుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీపై కోపంతో.. గత ప్రభుత్వం అమలు చేసిన 36 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వయం ఉపాధి రుణాలు, విదేశీ విద్య సాయం, ఆదరణ పథకం వంటివి ఉన్నాయి.
కొన్ని పథకాలకు పేర్లు మార్చారు. విదేశీ విద్య పథకం కింద పేదలకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ.10 లక్షల నుంచి 13 లక్షల వరకు సాయం చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ స్కీంను దాదాపు ఆపేసింది. పేద విద్యార్ధులు ఉన్నత చదువులకు వెళ్ళే అవకాశాన్ని దూరం చేసింది. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా రద్దు చేసింది. ఈ మోసం జనాలకు అర్థం కాకుండా ప్రభుత్వ ప్రకటనలకు కోట్లకొద్దీ ప్రజాధనాన్ని అసత్య ప్రచారం చేస్తోంది. మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు.
పైగా ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు మరిగి.. చెత్త బ్రాండ్లను జనం గొంతులో పోస్తున్నారు. ఒక కుటుంబంలో పిల్లలు ఎంత మంది ఉన్నా.. వారందరికీ అమ్మ ఒడి కింద ఏటా రూ.14 వేలిస్తానని జగన్ ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ గద్దెనెక్కాక కుటుంబంలో ఒక విద్యార్థికే ఇస్తున్నారు. ఇందులోనూ సగానికి సగం కోతపెట్టారు. ఏటా రూ.14 వేలు ఇస్తూ.. మద్యం రూపంలో రూ.36 వేలు లాగేస్తున్నారు. దీనికే టీడీపీ నేతలు నాన్న బుడ్డి అని పేరుపెట్టారు. మద్యంపై ‘జే’ టాక్స్ కింద రూ.5 వేల కోట్ల లూటీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
ఆ డబ్బు కూడా మద్యం తాగే పేదలే తమ జేబుల్లో నుంచి చెల్లించాల్సి వస్తోంది. ఇసుక రేటు నాలుగు రెట్లు పెరిగిపోయింది. ‘పైగా కృత్రిమ కొరత సృష్టించారు. దీంతో పనులు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండాల్సి వచ్చింది. వారికి పోయిన ఆదాయంతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చింది నామమాత్రమే. ప్రభుత్వ అండతో సిమెంటు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి.. సిమెంటు ధర విపరీతంగా పెంచేశాయి. ఇళ్లు కట్టుకునేవారిపై నడుం విరిగేంత భారం మోపారు’ అని వారు విమర్శిస్తున్నారు.
మహిళా బడ్జెట్ పేరుతో మహిళలను మోసం చేయడానికి జగన్ ప్రభుత్వం మరో ఎత్తు వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలు రావాలి. కానీ చేయూత పేరుతో రూ.75 వేలు మాత్రమే ఇచ్చి రూ.లక్షకు పైనే ఎగ్గొడుతున్నారు. ప్రజలపై వేసిన పన్నులతో గత 20 నెలల్లో ఒక్కో కుటుంబంపై రూ.లక్ష అదనపు భారం పడిందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్రం పెంచిన సుంకమే భారంగా ఉంటే.. జగన్ సర్కారు రోడ్ల అభివృద్ధి పన్ను కొత్తగా తెచ్చి అదనపు భారం వేసింది.
వాహనదారులను దోచుకుంటూ ఖజానా నింపుకొంటోంది. దీనిని రోడ్ల అభివృద్ధికి ఏ మాత్రం ఖర్చుపెట్టడం లేదు. ఓటుబ్యాంకు పెంచుకోవడానికి జనం ఖాతాల్లో డబ్బులు జమచేస్తోంది. వాహన మిత్ర పేరుతో ఆటోలు, క్యాబ్‌ల యజమానులకు ఏడాదికి రూ.పది వేలు ఇచ్చి.. జరిమానాల పేరుతో సగటున 21 వేల చొప్పున వసూలు చేస్తున్నారని.. పెట్రో ధరల భారం కూడా కలిపితే తమకు భారీ నష్టం వాటిల్లుతోందని వారు వాపోతున్నారు. 2019నాటి రబీ రుణాలు ఇప్పుడు కోటి మందికి ఇస్తున్నామని ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు విడ్డూరంగా ఉంటున్నాయి. ఏడాదిన్నర కిందట వేసిన పంటలకు ఇప్పుడు రుణాలు ఇవ్వడం ఏమిటో అర్థం కాకుండా ఉంది.