ఎన్నికల్లో సింగిల్‌గా వస్తానన్న జగన్.. శవాలతో వస్తున్నాడు అని టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ విమర్శించారు. ప్రస్తుతం పింఛన్ల పంపిణీ చేతకాక.. శవాల కోసం వెతుకుతున్నాడని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళ గిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. “ప్రతి ఎన్నికకు సింగిల్ గా వస్తానని చెబుతున్న జగన్, ప్రతిసారి శవాలతో వస్తున్నారు“ అని ఎద్దేవా చేశారు. “2014లో తండ్రి శవాన్ని వాడుకున్నాడు. 2019లో బాబాయి శవాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు“ అని విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. జగన్‌ను గొప్ప నటుడిగా మారాడని అన్నారు. “2019లో బాబాయిని లేపేశాడు, ఇప్పుడు పెన్షన్ పేరుతో వృద్ధులను చంపేందుకు సిద్ధపడ్డాడు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వలంటీర్లతో ఇంటివద్దకే అందిస్తాం. చంద్రబాబు 2019లో హామీ ఇవ్వకపోయినా పెన్షన్ ను రూ.1000 నుంచి 2 వేలకు పెంచారు“ అని లోకేష్ చెప్పారు.
జగన్ మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని పింఛను దారులను ఆయన కోరారు. జగన్ పాలనలో ఎన్నడూ లేని విధంగా బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. “తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్ నాథ్ గౌడ్ అనే బాలుడ్ని పెట్రోల్ పోసి దారుణంగా చంపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం“ అని నారా లోకేష్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకం పునరుద్ధరించి నాణ్యమైన పనిముట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని నారా లోకేష్ చెప్పారు.