జగన్ లో భయం పుట్టించామని, బీజేపీ, టీడీపీ, జనసేన చేతులు కలపడంతో గతంలో లేని విధంగా సీఎం జగన్ ము ఖంలో భయం, మాటల్లో తత్తరపాటు కనిపించిందని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బిల్డప్ బాబాయికి ఓటమి తథ్యమని అర్థమైందన్నారు. అందుకే ప్రజలను శరణు కోరుతున్నాడని అన్నారు. అయితే, ఐదేళ్లు నరకం చూసిన ప్రజలు ఇలాంటి సైకో సీఎంను క్షమించబోరని అన్నారు. బీజేపీ-జనసేన-టీడీపీ చేతులు కలపడంతోనే ఈ కూటమి విజయం రాసిపెట్టినట్టయిందన్నారు.
వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని నారా లోకేష్ విమర్శించారు. అనంతపురంలో సోమవారం రాత్రి నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారన్నారు. కొత్త నోటిఫికేష న్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా?అని ప్రశ్నించారు. ఐదేళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఇన్నాళ్లూ ఏం చేశారో జగన్ను ప్రజలు నిలదీయాలని కోరారు. పథకాలన్నీ రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలోని 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని విమర్శించారు. ఈ ఐదేళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
తాడిపత్రిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేష్ మాట్లాడుతూ.. తాడిపత్రిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఇక్కడి టీడీపీ కార్యకర్తలపై వెయ్యి దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు.