ఏపీలో మూడు రాజధానులంటూ 2019 డిసెంబరులో సీఎం జగన్ కొత్త పాటపాడిన సంగతి తెలిసిందే. కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్…అక్కడ ఏపీ హైకోర్టుతో పాటు వివిధ న్యాయ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏపీ లోకాయుక్త కార్యాలయం, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాలను త్వరలోనే కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నట్టు ఇటీవల ముగిసిన కేబినెట్ భేటీ తర్వాత అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ క్రమంలోనే లోకాయుక్త పి.లక్ష్మణరెడ్డి కర్నూలులో పర్యటించి పలు భవనాలను పరిశీలించారు. లోకాయుక్తతోపాటు కొన్ని ట్రైబ్యునళ్లు కూడా కర్నూలుకు తరలించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో అమరావతిలోని ఏపీ హైకోర్టు భవనాలను విస్తరించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రాంగణంలోనే కొత్త భవనాల నిర్మాణాలకు టెండర్లు కూడా పిలిచింది.
దీంతో, ఓవైపు కర్నూలు న్యాయరాజధాని అంటూ, మరోవైపు అమరావతిలో కొత్త భవనాల నిర్మాణం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు భవనం ప్రాంగణంలో రూ. 29.40 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల బిల్ట్ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది
అయితే, అమరావతితో పాటుగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ భావిస్తున్నారని, అందుకే ఇలా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు భవనం కార్యకలాపాలకు అనువుగా లేదని, అందుకే విస్తరణ అనివార్యం అవుతోందని చెబుతున్నారు. అయితే, అమరావతిలోని భవనాలను ఎలా వినియోగిస్తామనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని వారు అంటున్నారు