2019 ఎన్నికల్లో ఘన విజయంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి వచ్చారు.
ఆయన సీఎం కుర్చీ ఎక్కి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. అంతే సగం సమయం పూర్తయినట్లే.
సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలుపైనే జగన్ పూర్తి దృష్టి సారించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతున్నా ఆయన మాత్రం పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూనే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు పాలనపైనే ఫోకస్ పెట్టిన జగన్.. పార్టీని విస్మరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో..
వచ్చే ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీపై జగన్ దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి జూన్ 8వ తేదీతో మూడేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ప్లీనరీ మొదలు ఇక పార్టీ వ్యవహారాలను పట్టించుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తారని సమాచారం.
ఆ సమీక్షలు..
ప్లీనరీ తర్వాత జగన్ పూర్తిగా పార్టీపై ఫోకస్ పెట్టనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ప్రతి శని, ఆదివారాలు ఈ సమీక్షలు జరిపే అవకాశాలున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులుగా పార్టీని పట్టించుకోకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
నాయకుల మధ్య సమన్వయం లోపించింది. నామినేటెడ్ పోస్టులన భారీగా భర్తీ చేసినా ఇంకా విభేదాలు సమసిపోలేదని అంటున్నారు.
అక్కడక్కడా సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి.
దీంతో ఈ విభేదాలను పరిష్కరించే పనిలో జగన్ నిమగ్నం కాబోతున్నారని సమాచారం.
మరోవైపు వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంలో భాగంగా మరోసారి ప్రశాంత్ కిషోర్ టీమ్‌ను రంగంలోకి దింపనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని జగన్ మంత్రివర్గ సమావేశంలో సైతం చెప్పారు.
ప్లీనరీ తర్వాత పీకే టీం అడుగుపెట్టి నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి నివేదికలు అందించనుంది.
వాటి ప్రకారం జగన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.