ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడం సంగతి పక్కన పెడితే అప్పుల బాటలో నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానాలోని డబ్బును పప్పు బెల్లం లాగా జగన్ పంచి పెడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్ష నేతలు అధికార పక్షంపై విమర్శలు చేయడం సహజం అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే జగన్ చేస్తున్న అప్పులపై జాతీయస్థాయిలో చర్చ జరిగింది. ఇక, జగన్ ఏపీలో ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి అప్పేనని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా పలుమార్లు నివేదికలో వెల్లడించింది. అప్పులు చేస్తే చేశారు కానీ ఆ చేసిన అప్పులకి సరిగ్గా లెక్కలు కూడా చూపడం లేదని పలుమార్లు ఆరోపించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ తన పరిధికి మించి అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు హెచ్చరించింది.
ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని, ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా కావడానికి ఎన్నో నెలలు పట్టదన్న విషయాన్ని కేంద్ర ఆర్థిక నిపుణులు ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకువచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా సరే జగన్ తీరు మాత్రం మారడం లేదు. అప్పు దొరుకుతుంది అంటే చాలు తీసుకోవడానికి రెడీ అన్నట్లుగా జగన్ తీరుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆ విమర్శలకు తగ్గట్టుగానే తాజాగా మరో రూ.1000 కోట్ల రుణం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది. ఇందులో, 55 కోట్లను 18 నెలల కాలవ్యవధికి 7.45% వడ్డీకి తీసుకుంది. మరో 500 కోట్ల రూపాయలను 20 ఏళ్ల కాలపరిమితికి 7.45% వడ్డీకి సేకరించింది. తాజాగా తీసుకున్న రుణంతో జగన్ రుణపరిమితి హద్దులు దాటారు.
వాస్తవానికి ఈ ఏడాదికి గాను కేంద్రం విధించిన ఎఫ్ఆర్బిఎం 48,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, ఇప్పటి దాకా జగన్ దాదాపు 48,600 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తాజాగా తీసుకున్న వెయ్యి కోట్లతో రాష్ట్రం అప్పులపై కేంద్రం విధించిన హద్దును జగన్ దాటినట్లయింది. ఇక, ఈ ఏడాదికి క్రెడిట్ లిమిట్ పూర్తి కావడంతో మరి మిగతా మూడు నెలలు జగన్ రాష్ట్రాన్ని ఏవిధంగా నడుపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
జగన్ తాజాగా ఈ అప్పుల పరిమితి దాటడంతో రాబోయే మూడు నెలలపాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి కటకటలాడే పరిస్థితి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
Comments 1