ఇప్పటివరకు ఎప్పుడూ చూడని దరిద్రపుగొట్టు రాజకీయాలు అటు దేశంలోనూ.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఓపక్క కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సు.. వారికి మేలు చేసే విషయంలో ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దానిపైన ఫోకస్ పెట్టే కన్నా.. తమ తప్పులు వేలెత్తి చూపకుండా.. ఉల్టా తామే ఎదురు కౌంటర్ ఇచ్చే సరికొత్త కార్యక్రమానికి తెర తీస్తున్నారు. ఇలాంటివి ఎవరి దాకానో ఎందుకు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే షురూ చేశారని చెప్పాలి.
మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో.. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఏపీలో లభించకపోవటంపై జగన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.
రామోజీ రావు కొడుకు వియ్యంకుడిదే భారత్ బయోటెక్ అని.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఏపీలో రాకపోవటానికి ఇదో కారణంగా చెప్పటం విస్మయానికి గురి చేసింది.
రాజకీయాలు వేరు.. వ్యాపారాలు వేరు. ఆ మాటకు వస్తే.. భారత్ బయోటెక్ తీరు చూస్తే.. ఏ రోజు కూడా వారు రాజకీయాల్లో తలదూర్చటం.. వివాదాలకు నెలవుగా ఉండటం కనిపించదు.
తమ పనేదో తాము అన్నట్లు చేసుకుపోతారు. కోవాగ్జిన్ నిల్వలు ఏపీకి రాకపోవటానికికారణం కేంద్రం నుంచి రాకపోవటం.. కోవాగ్జిన్ టీకాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఒప్పందం చేసుకోకపోవటం.
ఏపీలో వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో.. ప్రజల నుంచి పెరుగుతున్న నిరసనలకు భిన్నంగా స్పందిస్తున్న జగన్ సర్కారు.. తనకు లోపించిన ముందుచూపు గురించి మాట్లాడకుండా.. ఆ లోపానికి సంబంధించిన వివరణ ఇచ్చే కన్నా… కోవాగ్జిన్ రామోజీ కొడుకు వియ్యింకుడి కంపెనీ కాబట్టి.. ఏపీలోని తమ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడటం అర్థం లేనిది.
ఎందుకంటే.. కోవాగ్జిన్ తో ఈ సమస్య ఉందనే అనుకుందాం? మరి.. సీరం కంపెనీ వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంది కదా? అదైనా ఏపీకి రావాలి కదా? ఆ వ్యాక్సిన్ ఎందుకు రాలేదు?
కేరళ లాంటి రాష్ట్రానికి స్టాక్ పంపిన సీరం సంస్థ.. ఏపీ ప్రభుత్వం అడిగితే ఇవ్వకుండా ఉంటుందా? మరీ ప్రశ్నకు సమాధానం ఏమిటి? కోవాగ్జిన్ అన్నంతనే రామోజీ పేరు చెప్పి తప్పించుకోవచ్చు.
కానీ.. కోవిషీల్డ్ మీద ఎవరి పేరు వేయటానికి సాధ్యం కాదు. ఈ కారణంతోనే దాని ఊసే ఎత్తటం లేదని చెప్పాలి. ఏమైనా ఇలాంటి రాజకీయాలు ఏ మాత్రం మంచివి కాదు కదా.. మరే ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా ఏపీ సర్కారుతో డీల్ చేయటానికి ఆసక్తిని ప్రదర్శించవన్నది మర్చిపోకూడదు.