తెలంగాణ ఎన్నికల విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. అనుకున్న దాని కంటే కొంచెం ముందుగా.. నవంబరు 30నే ఎన్నికలు జరిగిపోనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకో 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణ రాజకీయ పార్టీల్లో వేడి రాజుకుంది. కొన్ని రోజుల్లోనే ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయబోతున్నాయి. ఇక వచ్చే నెలన్నర రోజులు ప్రచారం హోరెత్తిపోనుంది. తెలంగాణను మించి వాడి వేడి రాజకీయం నడుస్తున్న ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.
కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని జగన్ చెబుతూ వచ్చాడు. తాజాగా ఆయన వైసీపీ పార్టీ క్రియాశీల సమావేశంలో జగన్ ఎన్నికలపై పూర్తి స్పష్టత ఇచ్చేశారు.
మార్చిలోనే ఏపీ ఎన్నికలు జరుగుతాయని జగన్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో తమ మేనిఫెస్టో రిలీజ్ అవుతుందని.. మళ్లీ జగన్ను ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలో, మన ప్రభుత్వమే ఎందుకు రావాలో చెబుతూ జనాల్లోకి వెళ్తామని జగన్ నేతలు, కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మార్చి అంటే ఎంతో దూరం లేదు. మధ్యలో నాలుగు నెలలే ఉంటాయి. ఈలోపు జగన్ ఆలోచన మార్చుకుని ముందస్తుకు వెళ్లడం సందేహమే.
కాబట్టి ఏపీ ఎన్నికలు మార్చిలోనే అని ఫిక్సయిపోవచ్చు. మరోవైపు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులో భాగం కాదన్నారు. ఆ అరెస్టుతో తనకు సంబంధమే లేదని తేల్చేశారు. తాను లండన్ పర్యటనలో ఉన్న సమయంలో పోలీసులు చంద్రబాబును ఎత్తుకుపోయారంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.