ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా కూడా చెప్పాల్సినవన్నీ చెప్పాలి. అభియోగాలు ఒక పరిధి దాటి ఉంటే నిరూపించాల్సినంత నిరూపించాలి. ఆవిధంగా ఆ రెండు పార్టీలూ ఉన్నాయా? ఏదేమయినప్పటికీ జగన్ చేసిన ఆరోపణలు మూడేళ్ల కాలంలో (దాదాపు) ఎలా ఉన్నాయి.. చంద్రబాబు చెప్పిన మాటలు మూడేళ్ల కాలంలో (దాదాపు) ఎలా ఉన్నాయి అన్నది ఇవాళ సహేతుకతకు తూగే చర్చ.
కానీ ఈ చర్చల్లో టీడీపీ కన్నావైసీపీ వెనుకంజలో ఉంది. అధికారం ఉండి కూడా ఫైళ్లు ఉండి కూడా రాజధాని లో ఆరోజు జరిగిన మతలబులు ఏవీ బయట పెట్టలేకపోయిందని అవి కేవలం ఆరోపణలుగానే ఇవాళ చూడాలని తేలిపోయింది.
పోనీ సీఆర్డీఏలో బోలెడు భాగోతం జరిగిందని కూడా వైసీపీ వ్యాఖ్యానించింది కదా వాటిపై ఎందుకని గొంతు వినిపించలేకపోతోంది. అంటే వైసీపీ వాటిపై దృష్టిసారించకుండా విధాన సంబంధ నిర్ణయాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకే ఇప్పటిదాకా ఉన్న కాలాన్ని వెచ్చించిందన్న ఆరోపణ ఒకటి వాస్తవం అయి ఉంది. ఇదీ చంద్రబాబు చెప్పే మాట. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న కూడా చెప్పే మాట ఇదే!
తేలని లక్ష కోట్లు… కానీ జనంలో క్లారిటీ
తేలని లక్ష కోట్లు. అవును ఈ మాట ఆరోజు టీడీపీ విషయంలో తేలలేదు అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా తేలలేదు. ఎలా అంటే రాజధాని లో లక్ష కోట్ల స్కాం అయిందని టీడీపీని ఉద్దేశిస్తూ వైసీపీ చేసిన కామెంట్లు నిరాధారం అయి పోయాయి.
అదేవిధంగా జగన్ అక్రమాస్తుల విలువ లక్ష కోట్లు అని ఆ రోజు టీడీపీ మీడియా తెగ రాసుకువచ్చింది. ఆ లక్ష కోట్ల లెక్క కూడా సగమే తేలింది. కాకపోతే ఆ లెక్క జనానికి కనిపిస్తోంది. లక్ష కోట్ల ఆస్తులు జగన్ కు ఉన్నాయని జనం నమ్మే పరిస్థితి జగన్ సొంత సంస్థలు లెక్కపెడితే అందరికీ అర్థమవుతుంది.
అమరావతి విషయంలో మాత్రం ఒక్క ఆధారం చూపించలేకపోవడం, కనీసం జనం కూడా నమ్మే పరిస్థితి లేకపోవడంతో వైసీపీ బుక్కైపోయింది. టీడీపీ పై వైసీపీ చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన వైసీపీ ఇప్పటికే మూడేళ్లుగా కాలం వెచ్చించినా కూడా ఏమీ చెప్పలేకపోయిందని పదే పదే చంద్రబాబు వర్గం అంటోంది. అంటే ఆ రోజు తాము చేసింది నిబద్ధతకు తార్కాణమేనని కూడా వైసీపీ ఈ మూడేళ్లలో ఒప్పుకుందని తాము భావిస్తున్నామని కూడా అంటోంది.ఈ నేపథ్యంలో ఓ సారి చంద్రబాబు వర్గం మాటలు చూద్దాం.
దోపిడీ వాస్తవమేనా ! ల్యాండ్ పూలింగ్ మాటేంటి ?
ఐదున్నర లక్షల కోట్ల దోపిడీ … చేశారని ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో లక్ష కోట్ల దోపిడీ చేశారని కూడా అభియోగం ఉంచారు. అలానే ఆరోజు సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే జగన్ మోహన్ రెడ్డి పై కోడికత్తితో హత్యాయత్నం చేయించారు అని ఆరోపించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ను కూడా చంద్రబాబే చేయించారని నిరాధార సహిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవీ టీడీపీ ఇవాళ చేస్తున్న ఆధార సహిత వ్యాఖ్యలు. ఇవే ఇకపై కూడా చేయనుంది.
మరి! రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరిగిందని ఆ రోజు అన్నారు జగన్ మోహన్ రెడ్డి. కానీ ఇది కూడా అబద్ధమేనని తేల్చేసింది హై కోర్టు.జడ్జిలకు భూముల కేటాయించారని ఇది కూడా న్యాయ సూత్రాలకు విరుద్ధమేనని బ్రైబ్ లో భాగమేనని కూడా వైసీపీ వ్యాఖ్యానించింది .కానీ ఇవేవీ ఇవాళ నెగ్గుకు రాలేదని వైసీపీని ఉద్దేశించి టీడీపీ అంటోంది.
ఆధారాలు ఉన్నాయా ?
నాటి ఆధారాలు నాటి గణాంకాలు నాటి వ్యాఖ్యలు ప్రజల దగ్గర చేసిన వాగ్దానాలు వీటిన్నింటిపై కూడా మళ్లీ మళ్లీ మాట్లాడుతోంది టీడీపీ. నిజంగానే రాజధానిలో అవినీతి జరిగితే నిరూపించాలని టీడీపీ పట్టుబడుతోంది. అంతేకాదు ఆ రోజు ప్రజాదర్బార్ ను కూల్చినంత సులువుగా ఏ నిర్మాణం చేపట్టలేకపోయిందని కూడా టీడీపీ వ్యాఖ్యానిస్తూ, తమపై చేసిన నిరాధార ఆరోపణలు చేసిన నిందలు ఇకపై చెల్లవని కూడా స్పష్టం చేస్తోంది. అంటే జగన్ ఓ విధంగా టీడీపీ విషయంలో వారిని ఎదుర్కొనే విషయంలో ఫెయిల్ అయ్యారని తేలిపోయింది అన్నది చంద్రబాబు వర్గం స్పష్టం చేస్తున్న మాట.