ఉన్నమాటంటే ఉలుకెక్కువ…యదార్థవాది లోక విరోధి…ఉన్నమాటంటే ఉన్న ఊరు అచ్చిరాదు…అన్న సామెతలను పెద్దవారు ఊరికే వేయలేదు. ఇప్పుడీ సామెతలన్నీ ఏపీ సీఎం జగన్ కు అతికినట్లు సరిపోతాయంటే అతిశయోక్తి కాదు. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంటే ఆయనకు ఎక్కడ లేని కోపం వస్తోంది. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గుర్తు చేస్తుంటే వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారు.
‘‘అధికారంలో ఉన్నవారు సక్రమంగా పాలించక పోతే, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంటే చెప్పులు, చీపుర్లు చూపించండి’’…అని సాక్షాత్తూ జగన్ ప్రతిపక్ష నేతగా అన్నారు. కానీ, జగన్ చెప్పింది చెప్పినట్లు చేస్తూ…జగన్ కు చెప్పు చూపిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మాత్రం జగన్, వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పవన్ పెళ్లిళ్లు మొదలు ఆయన ప్రచార రథం వారాహి వరకు సందు దొరికితే చాలు పవన్ పై పనిగట్టుకొని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.
దీంతో, వైసీపీ నేతల వైఖరిపై ట్రోలింగ్ జరుగుతోంది. జనం పదవులు ఇస్తే పాలన మీద దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విషయాలుపై, సెటిల్మెంట్లు, ధందాలపై మాత్రమే దృష్టి పెట్టే వైసీపీ నేతలకు పవన్ తన చెప్పు చూపించడంలో తప్పు లేదు అంటున్నారు నెటిజన్లు. గడప గడపకు అంటూ తిరుగుతున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రజలు చెప్పులు చూపించడమే కాకుండా వారి పైకి విసిరేసే పరిస్థితి ఉందని ట్రోల్ చేస్తున్నారు. రేపు మహిళలు చీపుర్లు చూపించే పరిస్థితి రావచ్చు అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్ మాటలలో చెప్పించి పవన్ చేతల్లో చేసి చూపించాడని పంచ్ లు వేస్తున్నారు.