రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు .. పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయారు. ప్రజలకు మేలు చేయ డం.. పాలన సాగించడం మాట ఎలా ఉన్నా.. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగా ణలోనూ.. మరో ఏడాదిలో ఎన్నికలు తప్పని ఏపీలోనూ.. ముఖ్యమంత్రులు ఇద్దరూ ఇప్పుడు కుటుం బసభ్యు ల కేసుల్లో తలమునలై.. ఏం చేయాలో దిక్కుతోచక సతమతం అవుతున్న పరిస్థితి కళ్లకు కడుతోందని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణ విషయాన్ని తీసుకుంటే.. `ఈడీ-బోడీ.. ఏం చేస్తరు.. అరెస్టు చేస్తరు గంతేనా!`. `ఇది ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు`. `ఏం చేస్తారు… నన్ను అరెస్టు చేస్తారు. చేయనివ్వండి` అని కొన్నాళ్ల కిందట వరకు గంభీరమైన ప్రకటనలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్, ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవితలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈడీ విచారణను ఎదుర్కొంటే.. అరెస్టు చేస్తే.. పరువు ఏంగాను? అని వారు అంతర్మథనం చెందుతున్నారు.
పోనీ.. కేంద్రంతో ఏమైనా సఖ్యత ఉందా? అంటే.. నిత్యం భోగి మంటలా రాజకీయ రణం కొనసాగుతూనే ఉంది. పోనీ.. అరెస్టు చేస్తే చేయనీ అని వదిలేద్దామా? అంటే.. అదే జరిగితే.. కన్న కుమార్తె మద్యం కుంభకోణంలో చిక్కుకుందని, అరెస్టయిందని తెలిస్తే.. తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు ఎలా అడగాలి? అనే అంతర్మథనంలో కేసీఆర్ కూరుకుపోయారు. అందుకే.. సాధ్యమైనంత వరకు అసలు విచారణకే వెళ్లకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈడీ మాత్రం విచారణకు రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ నెల 20న విచారణకు రాకపోతే.. ప్రత్యేక ప్రొవిజన్ ప్రకారం అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. రెండు కీలక కేసుల్లో సీఎం జగన్ ఊపిరి బిగబట్టుకుని ఉంటున్నారు. ఒకటి సొంత బాబాయి హత్య అయితే.. రెండో తనపైనే జరిగిన కోడికత్తి హత్యాయత్నం(వైసీపీ చెబుతున్నట్టుగా). ఈ రెండు కేసుల్లోనూ.. ఇప్పుడు సీఎం జగన్ అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పటి వరకు వివేకా హత్య తమ వారికి సంబంధం లేదని చెబుతూ వచ్చిన సీఎంజగన్.. తన సొదరుగా చెప్పుకొన్న ఎంపీ అవినాష్ అరెస్టుకు అన్నీ రెడీ అవుతుండడంతో ఊపిరి సలపడం లేదు.
ఇక, కోడికత్తి కేసు విషయంలో తానే స్వయంగా సాక్ష్యంచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలోనే ఆయ న ఈ విచారణకు సీఎం హోదాలో ఉన్నా..వెళ్లక తప్పదని కోర్టు తేల్చేసింది. అటు సొంత పార్టీ ఎంపీని సొంత బాబాయి కేసులో అరెస్టు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో అది ఆయనకు శరాఘాతంగా పరిణమిస్తుందని అంటున్నారు. ఇటు, కోడికత్తి కేసులోనిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌కు ఏదో ఒకటి తేలకపోతే.. ఇది ఎన్నికల స్టంటుగా ప్రతిపక్షాలు ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక సీఎం జగన్ తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.