రాయి రత్నం అవడం సహజం. కానీ రత్నాలు కూడా రాయిలు అవడమే ఏపీలో విచిత్రం. గంపెడు ఆశలతో నవరత్నాలను ఆశించి గెలిపించుకున్న ముఖ్యమంత్రి ఒక్కో రత్నాన్ని రాయిగా మార్చడం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు కురిపించిన ప్రేమను ఒక భ్రమ అంటూ తేల్చేస్తున్నాడు. ఇక నేను తీసుకున్న ఏ నిర్ణయం వల్ల కూడా మీరు నన్నేమీ చేయలేరు అన్న అహంకారం రాష్ట్రం పాలకుడికి ఇగోని తెచ్చిపెట్టింది.
కేవలం 16 నెలల వైసీపీ పాలనలో జగన్ ప్రకటించిన నవరత్నాల్లోంచి 2 రత్నాలు ఊడిపోయాయి. మరో రత్నం సగం విరిగిపోవడానికి రెడీగా ఉంది. 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాను అంటూ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అంటూ… జనాలకు తీరని గుండె కోత పెడుతున్నారు ముఖ్యమంత్రి. జగన్ హయాంలో అన్నీ బాదుళ్లు, కోతలే. ప్రభుత్వానికి రావల్సింది పెంచడం, ప్రజలకు రావల్సింది కోయడం ఇదే సిద్ధం.
వైసీపీ ఎన్నికల ముందు “నవరత్నాలు” ప్రకటించి, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా వాటినే ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే “నవరత్నాల అమలే తమ ప్రభుత్వ ప్రాధాన్యత” అని ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటిపై జనం చాలా హోప్ పెట్టుకున్న మాట నిజమే. వీటిలో ఒకటి “మద్య నిషేధం”. మధ్యనిషేధానికి సంబంధించి “ప్రభుత్వమే మద్యం షాపుల్లో అమ్మకాలు చేపడుతుందని, ఏడాదికి 20 శాతం చొప్పున షాపులు తగ్గించి ఐదేళ్లు అయ్యేసరికి పూర్తిగా మద్యనిషేధం అమలులోకి తీసుకు వస్తామని” ప్రకటించింది.
ధరలు పెంచడం కూడా ఇందులో వ్యూహమే అన్నారు. చివరకు అందరూ పక్క రాష్ట్రాలకు పోయి కొంటున్నారు, మన ఆదాయం పోతుందని… తిరిగి ధరలు తగ్గించారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 20 శాతం షాపు తగ్గిస్తాం అన్నారు. మొదటి ఏడాది పాటించారు. రెండో ఏడాది రుచిమరిగిన ఆదాయం పోతుందని తగ్గించకుండా ఆపేశారు. రెండో ఏడాదిలో ఉన్నషాపులన్నీ యధాతధంగా కొనసాగించడమే కాకుండా కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా “మద్యం మాల్స్”కు కూడా ప్రభుత్వం అనుమతించి జనాల్ని మద్యం బాట పట్టించింది.
“మందుబాబులను” తాగుడు నుంచి బయట పడవేసేందుకు ఏడాదిక్రితం ప్రభుత్వం ఏర్పాటుచేసిన “మద్య విమోచన ప్రచార కమిటీ” గాయబ్. దాని కార్యకలాపాలు ఎక్కడా కానరావడం లేదు. దీన్ని బట్టి “నవరత్నాల్లో ఒక రత్నం” రాయిగా మారిపోయిందనే చెప్పాలి.
రాలిపోయిన మరోరత్నం వృద్ధుల పింఛను. ఇది ప్రతి ఏడాది 250 పెంచి 3000 వేలు చేస్తాను అన్నారు. మొదటి ఏడాది పెంచారు. ఆ తర్వాత డబ్బుల్లేవ్ అంటూ పెంచకుండా ఎగ్గొట్టింది ప్రభుత్వం. దీంతో నవరత్నాల్లో మరో రత్నం ఊడిపోయింది. పాపం 250 కోసం గత నాలుగు నెలలుగా పేదలు ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు బాగానే ఉన్నా జగన్ నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడిపై అనేక డింకీలు కొట్టింది ప్రభుత్వం. ప్రతి తల్లి బాధ్యతను నేను తీసుకుంటాను అని జగన్ ఎన్నికల ముందు చెప్పారు. తీరా అమలుకు వచ్చేసరికి ఇచ్చేది ఒక బిడ్డకే అన్నారు. తర్వాత సర్కారు బడికెళ్తేనే ఇస్తాం అన్నారు. జనంనుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో అందరికీ ఇస్తున్నారు. కానీ నాడు నేడులో భాగంగా పాఠశాలలు అన్నీ బాగుపడ్డాక ప్రైవేటు బడులకు అమ్మ ఒడి ఎత్తేస్తారట. ఇక్కడ అంతా చక్కగా ఉన్నపుడు దానికెందుకు పోతారు అనడానికి సర్కారు సిద్ధంగా ఉంది.
ఇక ఈ రత్నాలే కాదు. సీపీఎస్ రద్దు కల చెదిరింది. జీతం సగం కోత పడింది. ఎన్నో పథకాలు రద్దయ్యాయి. రావల్సిన కొత్త పథకాలు పోయాయి. కరోనా వస్తే 2 వేలు కొందరికి ఇచ్చి చాలా మందికి ఎగ్గొట్టారు. ప్లాస్మా ఇస్తే 5 వేలు అన్నారు. అదీ పాయె. కరోనాతోమరణిస్తే 15 వేలు అన్నారు అదీ పాయె. ఇక వీటికి తోడు కరెంటు పెట్రోలు ఛార్జీలతో జనం నెత్తిన బాదేస్తూనే ఉన్నాడు జగనన్న. ఇపుడు తమిళనాడులో మనకంటే 7 రూపాయలు ధర తక్కువ పెట్రోలు.