ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు…వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలా ఓ పక్క ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ…సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టడం మాత్రం జగన్ ఆపకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన ఆలోచనా విధానం లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైందని, రాష్ట్రానికి సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని ఐవైఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీ ఆర్థిక దుస్థితి చూస్తుంటే బాధేస్తోందని, ఒకటో తారీకున ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు లేని దుస్థితి దాపరించిందని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి,ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని విధంగా ఏపీ ఆర్థిక శాఖ దిగజారిందని అన్నారు. విశాఖలోని భూములు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని, రాష్ట్రం నెత్తిమీద ఉన్న రూ.5లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారని ఐవైఆర్ ప్రశ్నించారు. అప్పు తేవడం.. పంచడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని, ఇంకా ఎంతకాలం అప్పు పుడుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలని హితవు పలికారు.
తెచ్చిన అప్పులను తీర్చేందుకు కార్యాచరణ, ప్రణాళిక ఏముందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పప్పు బెల్లాల్లా పంచుతూ పోతే చివరకు పంచడానికి ఏమీ మిగలదన్నారు. బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరిపోతోందని, మరి, మౌలిక సదుపాయాల మాటేమిటని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.
భవిష్యత్తులో నెల నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమేనని, జగనన్న ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పు అడుగుతున్న అధికారులు.. ఇకపై నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి రావొచ్చని జోస్యం చెప్పారు. చెప్పినవన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్ర దండం, అల్లావుద్దీన్ అద్భుత దీపం లేవని చురకలంటించారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాదని, కేంద్రం తరహాలో బడ్జెట్లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చని సలహా ఇచ్చారు. ఏపీకి సరైనోడు లేడంటూ ఐవైఆర్…. జగన్ గాలి తీశారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.