ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన ఆత్మగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు పేరున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ వీర విధేయుడిగా పేరున్న కేవీపీ…వైఎస్ మరణానంతరం జగన్కు దూరంగా ఉంటున్నారు. అలా అని జగన్ పై విమర్శలుగానీ, ప్రశంసలుగానీ గుప్పించిన దాఖలాలు పెద్దగా లేదు. అసలు ఏపీ గురించిగాని, ఏపీకి జరుగుతున్న నష్టం గురించి కానీ నోరు విప్పలేదు. పార్టీలపరంగా ఇద్దరూ వేరు కాబట్టి ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది అని అనున్నారు అంతా. కానీ, జగన్ పై కేవీపీ తాజా వ్యాఖ్యలు చూస్తే మాత్రం…కేవీపీ జగన్ కోవర్టు అని అనిపించక మానదు.
ఇక, ఈ మధ్య బెస్ట్ సీఎంల జాబితాలో జగన్ ర్యాంక్ 1 నుంచి 16కు పడిపోయిన నేపథ్యంలో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకత పెరిగిపోయిందని, పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ గురించి మాట్లాడిన కేవీపీ…ఏకంగా జగన్ పాలనకు కితాబివ్వడం చర్చనీయాంశమైంది. జనంలో జగన్ కు ఎలాంటి వ్యతిరేకత లేదని, ఇక, జగన్ తో పోటీపడే నేత ఏపీలో లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు కేవీపీ.
జగన్ కు ఇప్పటికీ జనాదరణ తగ్గలేదని, తన అల్లుడు కాని అల్లుడుకు కేవీపీ మామ కితాబిచ్చారు. అయితే, జగన్ అక్రమాస్తుల కేసులతో సతమతమవుతున్నప్పుడు, జైలుకు వెళ్లినపుడు, బెయిల్ రద్దు వ్యవహారం కాకరేపుతున్నప్పుడు స్పందించని కేవీపీ…సడెన్ గా ఎంట్రీ ఇవ్వడం, జగన్ ను ఆకాశానికెత్తేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే…కేవీపీ మాత్రం ఇలా వైరి పార్టీ అధినేతను, తమ శత్రువు జగన్ ను ప్రశంసించడం చర్చనీయాంశమైంది.
ఏపీ కాంగ్రెస్ కు కేవీపీ కీలకమవుతారనుకుంటే…ఇలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని హైకమాండ్ కూడా గుర్రుగా ఉందట. జగన్ ను సవాలు చేసే స్ధితిలో ఏ ప్రతిపక్షం కూడా లేదని కేవీపీ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడుపడడం లేదట. కేవీపీ చూపు వైసీపీపై పడిందని, అందుకే ఇలా జగన్ జపం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవీపీ….జగన్ కోవర్ట్ అని…కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ జగన్ కు ఇన్నాళ్లు సైలెంట్ గా సాయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.