సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆయనను సీఎం జగన్ ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏబీవీని ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేయించిన జగన్…ఆ సస్పెన్షన్ రెండేళ్ల వరకు కొనసాగేలా చూశారు. ఆ తర్వాత తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరినా…పెడ చెవిన పెట్టారు. చివరకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో చేసేదేమీ లేక సస్పెన్షన్ ఎత్తివేశారు.
అయితే, ఏబీవీ చేతిలో తనకు గర్వభంగం కావడంతో జగన్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అక్కడ రిపోర్ట్ చేసినా పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ సర్కార్ మీన మేషాలు లెక్కించింది. అయితే, ఈ వ్యవహారంపై కూడా విమర్శలు రావడంతో ఎట్టకేలకు తప్పని సరి పరిస్థితుల్లో ఏబీవీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 15న పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ వంటి అనామక పోస్టును ఏబీవీకి కేటాయించి జగన్ మరోసారి తన మోనార్కిజాన్ని చాటుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
అయితే, జగన్ మోనార్కిజం అంతటితో ఆగలేదు. మరోసారి కుంటి సాకులు చెప్పి…పసలేని ఆరోపణలు చేసి ఏబీని పోస్టింగ్ ఇచ్చిన 15 రోజుల్లోపే సస్పెండ్ చేయించారు జగన్. అంటే, తన హయాంలో ఏబీవీ పనిచేయకూడదని జగన్ ఫిక్సయ్యారు. ఎందుకంటే, మరో రెండేళ్లు జగన్ సీఎంగా ఉంటారు. ఏబీవీ తొలి సస్పెన్షన్ మాదిరిగానే మలి సస్పెన్షన్ ను కూడా రెండేళ్లు కొనసాగిస్తారు. ఇక, ఏబీవీకి మరో రెండేళ్ల సర్వీస్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో, తన కెరీర్ పై ఓ క్లారిటీ వచ్చిన ఏబీవీ..రెండ్రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు.
“దుర్మార్గుడైన రాజు కింద పని చేయడం కంటే అడవికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం మంచిదని” ఓ కవి చెప్పారంటూ రెండు రోజుల కిందట అన్నారు. అయితే, ఏదో ఆవేదనలో ఏబీవీ అలా అంటున్నారని అంతా అనుకున్నారు. కానీ, ఏబీవీ మాత్రం ఆ విషయం చాలా సీరియస్‌గానే చెప్పనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఏబీవీ పంచెకట్టి పొలంలోకి దిగారు. ఐపీఎస్‌గా 30 ఏళ్ల అనుభవం ఉండి, డీజీపీ హోదాలో పనిచేసిన వ్యక్తి వ్యవసాయం మొదలుబెట్టారు.
పామాయిల్ తోట ఉన్న పొలంలో అంతర పంటగా మరో పంట వేయడానికి భూమిని సిద్ధం చేస్తున్నట్లుగా ఉన్న ఏబీవీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, జగన్ పుణ్యమా అని ఈ రోజు పొలంలో కలుపు మొక్కలు పీకుతున్న ఏబీవీ…ఏదో ఒకరోజు తనను ఇబ్బంది పెట్టిన కులపు మొక్కలు కూడా పీకుతానని గతంలోనే శపథం చేసిన సంగతి తెలిసిందే.