ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజకీయంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరం నడుస్తోంది. ఆయన అప్రతిహత విజయాలతో దూసుకుపోయిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. అయితే.. ఇదే సంవత్సరంలో ఆయన ఊహించని అవమానాన్ని.. ఇంకా చెప్పాలంటే ఘోర అవమానాన్ని చవి చూశారు.
మోడీని నిలువు ను చెరిగేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలోనూ ఆయన ఆ రాష్ట్రం పర్యటించా రు. అయితే.. ఇటీవల తమకు మిత్రులు పెరుగుతున్నారని.. ఖాయంగా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటామని ఉవ్విళ్లూరుతున్న పంజాబ్‌లో మాత్రం అనూహ్యమైన అవమానం ఎదురైంది.
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోడీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. “కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదు” అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా.. సభా వేదికపై ప్రకటించారు. దీనికి ముందు దాదాపు 20 నిముషాల పాటు దేశాధినేత అయిన.. మోదీ ఒక ఫ్లైవోవర్‌పై నడిరోడ్డులో నిలిచిపోయారు. ఆయన కాన్వాయ్‌ను వెనక్కి వెళ్లనీయకుండా.. ముందుకు సాగనివ్వకుండా కూడా నిరసన కారులు అడ్డుపడ్డారు.
మరి ఇంత అవమానం వెనుక అసలు ఏం జరిగింది? ఎందుకు? తనకు తిరుగులేదని భావిస్తున్న మోడీ ప్రతిష్ట ఈ ఘటనతో ఎలా జారిపోయింది. జాతీయ మీడియా.. లోకల్ మీడియాలు అటుంచితే.. అంతర్జాతీ య సమాజం, అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఘటనను హైలెట్ చేయడం గమనార్హం.
మన మీడియా ఎక్కడా మోడీకి అవమానం జరిగిందని రాసేందుకు సాహసించకపోయినా.. అంతర్జాతీయ మీడియా మాత్రం దీనిని మోడీకి జరిగిన ఘోర అవమానంగా రాసేసింది. ఆది నుంచి ఉద్యమ నేతలను కించ పరచడానికి తోడు.. ఇటీవల మేఘాలయ గవర్నర్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆగ్రహాన్ని పెంచాయని అంతర్జాతీయ మీడియా రాసింది.
మోడీ దేశాధినేతగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 130 మంది రైతులు మూడుసాగు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో అశువులు బాసారు. అయితే.. ఇవన్నీ.. తన కోసం చేశారా? అంటూ.. మోడీ పరుషంగా వ్యాఖ్యానించారని, ఆయనకు అహంకారం ఎక్కు వని.. ఇటీవల మాలిక్ వ్యాఖ్యానించారు.
ఇది రాజకీయంగా చాలా దుమారం రేపింది. అదేసమయంలో రైతుల్లోనూ మోడీ పట్ల నమ్మకం మరింత సన్నగిల్లేలా చేసింది.ఈ క్రమంలోనే మోడీ పర్యటనకు వారు అడ్డు తగిలారు. పోనీ.. కేంద్రం చెబుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వారిని నిలువరించే చర్యలు తీసుకుని ఉండాలి కదా!
కానీ, ఎందుకు నిలువరించాలి. ఏ వ్యూహంతో అయితే.. మోడీ పంజాబ్ పర్యటనకు రెడీ అయి వచ్చారే.. అదే ఎన్నికల వ్యూహం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత అవసరం. ఇప్పుడు రైతులను నిలువరించి.. చేజేతులా చేతులు కాల్చుకునే పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం లేదన్నది అంతర్జాతీయ మీడియా కథనం.
రైతులను నిలువరిస్తే.. మోడీపై వ్యతిరేకత తమవైపు తిరగడంతోపాటు.. మోడీ వచ్చి తమకు వ్యతిరేకంగా గళం వినిపిస్తారని.. తెలియని నేతలు అక్కడ లేరని.. అందుకే.. జరగాల్సింది జరిపోయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఏదేమైనా.. మోడీకి జరిగిన అవమానం ఆయన రాజకీయ జీవితంలో చెరగని మచ్చగా మిగిలిపోతుందని ఈ మీడియా వ్యాఖ్యానించడం గమనార్హం.