ఏపీలో పీఆర్సీ వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోన్న సంగతి తెలిసిందే. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై స్పస్టమైన హామీ వస్తేనే చర్చలకు ముందుకు వస్తామని ఈ రోజు మంత్రులతో జరిగిన భేటీలో కూడా ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఎప్పటిలాగే చర్చలకు పిలిచి…అసంపూర్తిగా ప్రభుత్వం ముగించిందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు…ఏపీ సీఎస్ వ్యవహారం పుండు మీద కారం చల్లినట్లయింది.
ఈ రోజు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచిన సంగతి తెలిసిందే. మంత్రులతో స్టీరింగ్ కమిటీ భేటీ అసంపూర్తిగా ముగిసింది. అయితే, ఆ భేటీలో కూడా తమకు అవమానం జరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. భేటీలో జరిగిన పరిణామాలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తమను అవమానించారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగుల తరపున రెప్రజెంటేషన్ ఇవ్వడానికి నలుగురం జేఏసీ నేతలం వెళ్లామని, అయితే, తమకు ఆయన ఒక్క నిమిషం సమయాన్ని కూడా కేటాయించలేదని ఆరోపించారు. కనీసం, మర్యాద కోసమైనా కూర్చోమని అనలేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
అంతకుముందు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని సీఎస్ సమీర్ శర్మ చెప్పారని, కానీ, దానికి విరుద్ధంగా ఈరోజు వ్యవహరించారని సూర్యనారాయణ ఆరోపించారు. ఆర్థికశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని సూర్యనారాయణ విమర్శించారు. అధికారులపై ఫిర్యాదు చేసే అధికారం ఈ దేశ పౌరుడిగా తనకు ఉందని అన్నారు. అధికారుల శైలి ఇలాగే ఉంటే కేంద్ర డీఓపీటీకి కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మరి, ఈ వ్యవహారంపై సీఎస్ సమీర్ శర్మ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.