భారత సంతతి వ్యక్తులు ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిర పడిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణించి భారత దేశంతో పాటు వారుంటున్న దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, మరికొందరైతే ఎన్నారైలుగా స్థిరపడి అక్కడి రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో పాటు పలువురు రాజకీయ నేతలుగా ఎదిగారు.
ఈ క్రమంలోనే భారత సంతతి వ్యక్తి ఒకరు ఏకంగా బ్రిటన్ ప్రధాని రేసులో అగ్రస్థానంలో ఉన్నారని టాక్ వస్తోంది. అదృష్టంతో పాటు అన్ని కలిసొస్తే బ్రిటన్ కు తర్వాతి ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో తర్వాతి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి, బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 42 ఏళ్ల రిషి ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు.
ప్రపంచ ఐటీ రంగంలో సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి సునక్ స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ వివాహం చేసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్ కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందారు. రిషి నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా పుంజుకోగలిగింది. కరోనా విపత్తు వేళ వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించారు రిషి. దీంతో, ఆయన పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
కాగా, కొంతకాలంగా ప్రధాని జాన్సన్ పనితీరు దారుణంగా ఉండడంతో పాటు ఓ వివాదంలో చిక్కుకున్న ఎంపీకి ఆయన మద్దతునివ్వడం సొంత పార్టీ నేతలకు కూడా నచ్చలేదు. దీంతో, బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి దాదాపు 40 మంది మంత్రులు, సహాయకులు రాజీనామా చేసి వైదొలిగారు. వారిలో రిషి సునక్ కూడా ఉన్నారు. మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో, ఎట్టకేలకు నిన్న బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు.
Comments 1