భారత వ్యాపార దిగ్గజం, బిజినెస్ టైకూన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురువారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. 86 ఏళ్ల వయసున్న రతన్ టాటాకు వివాహం కాలేదు. పెళ్లి చేసుకుంటే కుటుంబానికి సమయం కేటాయించలేనన్న ఉద్దేశ్యంతో ఆయన పెళ్లి చేసుకోలేదు.
రతన్ టాటా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎంవోలతోపాటు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడని, అసాధారణమైన వ్యక్తి అని మోడీ కొనియాడారు. మనదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించిన వ్యాపారవేత్త టాటా అని అన్నారు. ఆయన వినయ విధేయత, సమాజాన్ని మెరుగుపరచాలన్న నిబద్ధత అనిర్వచనీయమని మోదీ అన్నారు.
ఇక రతన్ టాటా మాదిరిగా దార్శనికత, చిత్తశుద్ధి ఉన్న వ్యాపారవేత్తలు చాలా అరుదుగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక బిజినెస్ టైకూన్ నే కాకుండా సమాజ హితం కోరే నిజమైన మానవతా వాదిని కూడా కోల్పోయామని చంద్రబాబు అన్నారు. పరిశ్రమల విషయంలో, సమాజానికి సేవ చేయాలని దాతృత్వం విషయంలో ఎన్నో తరాలకు టాటా స్ఫూర్తి అని చంద్రబాబుకు ప్రశంసించారు.
రతన్ టాటా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎంవో ఎక్స్ లో ట్వీట్ చేసింది. మన దేశాన్ని ప్రపంచ పారిశ్రామిక శక్తిగా మార్చడంలో రతన్ టాటా చేసిన కృషి ఎనలేనిదని సీఎంవో ప్రశంసించింది. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రా కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రత్మాక మలుపు తిరగనుందని, అటువంటి సమయంలో టాటా వంటి మహోన్నత వ్యక్తి వీడ్కోలు పలకాల్సి వచ్చిందని అన్నారు. అటువంటి లెజెండ్స్ ను సమాజం ఎప్పటికీ మర్చిపోదని, వారు చనిపోలేదని ఆనంద్ మహేంద్రా చెప్పారు.