ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఒకటి తర్వాత ఒకటి చొప్పున కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ‘ఇండియన్ 2’ ను ఎప్పుడు స్టార్ట్ చేశారో కానీ ఆయనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.
గత ఏడాది ఈ సినిమా షూట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకోవటం.. నలుగురు చనిపోవటం తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో పలువురు గాయపడ్డారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు భారీ నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉన్నప్పుడే ఈ చిత్ర హీరో కమల్ హాసన్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఆయన ఇప్పుడు ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఆయన ఎప్పుడు ఈ చిత్రానికి సమయం కేటాయిస్తారో అర్థం కాని పరిస్థితి.
ఇలాంటివేళ.. రామ్ చరణ్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేసుకున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇలాంటివేళ లైకా ప్రొడక్షన్ ఊహించని రీతిలో శంకర్ కు కోర్టు కేసు పెట్టి షాకిచ్చింది. ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్టుకు డైరెక్టర్ గా వ్యవహరించకూడదన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇందులో ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ.. తమ వాదనను వినిపించారు. ‘‘ఇండియన్ 2 బడ్జెట్ రూ.236 కోట్లు అనుకున్నాం. ఇప్పటివరకు చేసిన షూటింగ్ కు రూ.180 కోట్లు ఖర్చు అయ్యాయి. దర్శకుడు శంకర్ కు ఇస్తామన్న రూ.40 కోట్ల పారితోషికంలో ఇప్పటికే రూ.14 కోట్లు చెల్లించాం. మిగిలిన రూ.26 కోట్లను కోర్టు సమక్షంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన కోర్టు.. శంకర్ తన వాదనను వినిపించేందుకు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు. సాధారణంగా ప్రముఖ నిర్మాణ సంస్థకు.. ప్రముఖ దర్శకుడికి మధ్య వివాదం తలెత్తితే.. అది నాలుగు గోడల మధ్యే సమిసిపోతుంది. అలాంటిది.. కోర్టు మెట్ల వరకు వచ్చిందంటే.. విషయం సీరియస్ అయ్యిందని చెప్పాలి.మరి.. శంకర్ దీనిపై ఎలా రియాక్టు అవుతారో చూడాలి.